• రక్తదానం చేసిన 8 రోజుల్లోనే శరీరంలో కొత్త రక్తం తయారు
  • రక్తదానం చేయండి..హృదయ సంబంధిత వ్యాధుల నుంచి దూరమవ్వండి
  • జర్నలిస్టు కృష్ణ పిలుపు

వేద న్యూస్, వరంగల్ :

రక్తదానం చేయడమంటే ఇతరుల ప్రాణాలను కాపాడటమే అని యువ జర్నలిస్టు లింగబత్తిని కృష్ణ అన్నారు. రక్తదానం చేయడంలో యువకులు ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరూ రక్తదానంలో పాల్గొంటే సమాజంలో రక్తం కొరత అనే మాట ఉత్పన్నం కాదనీ తెలిపారు.

బుధవారం జర్నలిస్టు లింగబత్తిని కృష్ణ.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా వరంగల్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న శారద అనే మహిళ కు రక్తం అవసరమని తెలుసుకొని.. రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన తో పాటు ఉన్న తోటి మిత్రులు అశోక్, రవి తేజ సైతం రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా లింగబత్తిని కృష్ణ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మన శరీరంలోని రక్తంలో ఉండే ఐరన్‌ శాతం తగ్గి, హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుందనీ వివరించారు. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గి, తద్వారా ఊబకాయం తగ్గే అవకాశం ఉందనీ వెల్లడించారు. క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు కూడా కొంతమేర తగ్గుతాయని స్పష్టం చేశారు.

రక్తం దానం చేసిన 8 రోజుల్లోనే శరీరంలో తిరిగి రక్తం తయారవుతుందని తెలిపారు. రక్తం దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని, అపోహలు తగ్గించుకుని రక్తదానం చేసేందుకు ముందుకు వస్తేనే రక్తం కొరత తీరి, ఎన్నో ప్రాణాలు నిలబడే అవకాశం ఉందని ఈ సందర్భంగా లింగబత్తిని కృష్ణ తెలిపారు.