•  హన్మకొండ కలెక్టరేట్‌లో అర్జీదారులు, ఉద్యోగుల అవస్థలు
  •  సత్వరమే బాగు చేయించాలని వినతి

వేద న్యూస్, హన్మకొండ:

అది జిల్లా పాలనాధికారి (ఐఏఎస్) ఉండే ఆఫీసు. నిత్యం జిల్లా బాస్ సదరు డిస్ట్రిక్ట్‌కు సంబంధించిన పనులకు సంబంధించిన ఆదేశాలు వెలువరిస్తుంటారు. జిల్లా ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఆ ఆఫీసుకు వచ్చి.. కంప్లయింట్స్‌తో పాటు వినతపత్రాలు సమర్పిస్తుంటారు. అలాంటి పాలనా కార్యాలయంలో లిఫ్ట్‌ సేవలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. హన్మకొండ జిల్లా కలెక్టరేట్‌‌కు సంబంధించిన ముచ్చట అండోయ్ ఇది..

నెల రోజులైనా పట్టింపులేదా?

సుమారు నెల రోజుల నుంచి హనుమకొండ డిస్ట్రిక్ట్‌ కలెక్టరేట్‌లో లిఫ్ట్‌ పనిచేయడం లేదు. అయినా ఇంతవరకు వాటిని బాగు చేయలేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే వృద్ధులు, దివ్యాంగులతో పాటు ఉద్యోగులు సైతం మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతున్నారు.

మూడు ఫ్లోర్లు (జీ ప్లస్‌2) ఉన్న హన్మకొండ కలెక్టరేట్ భనవంలో రెండో అంతస్తులో హన్మకొండ జిల్లా వైద్యశాఖ అధికారి ఆఫీసు ఉంది. రెండో అంతస్తు కావడంతో వృద్ధులు, దివ్యాంగులు, మెట్లు ఎక్కలేక లిఫ్ట్‌ను ఆశ్రయిస్తుంటారు. సుమారు నెల రోజుల క్రితం లిఫ్ట్ పాడైపోయినట్టు సమాచారం. దీంతో శుక్రవారం పలు పనుల మీద వచ్చిన పలువురు ఆపసోపాలు పడుతూ, మెట్ల మీదుగా వెళ్లాల్సి వచ్చింది. జిల్లా కలెక్టర్‌ స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి లిఫ్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.