• సైన్మా ఎంత పని చేసే..!?
  •  చిత్ర ప్రేరణతో పిస్తోల్ తెప్పించుకున్న వ్యక్తి..
  •  వ్యాపారికి బెదిరింపులు.. హత్య చేసేందుకు ప్లాన్
  •  ఎన్నికల తనిఖీలో నిందితుడి పట్టివేత
  •  ఒక పిస్తోల్ తపాంచ, రెండు మ్యాగ్జిన్లు స్వాధీనం
  •  జిల్లా ఎస్పీ నితిక పంత్ వివరాలు వెల్లడి

 

వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి:

సులువుగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశ అతనికి ఓ సినిమా వల్ల కలిగింది.! వ్యాపారిని బెదిరించి.. హత్యకు ప్లాన్ చేసిన సదరు నిందితుడు.. హతమార్చేందుకు వెళ్తు్న్న క్రమంలో పోలీసులకు ఎన్నికల తనిఖీలో మంగళవారం పట్టుబడ్డాడు.

కౌటాల పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ నితిక పంత్ వివరాలను వెల్లడించారు. ఓ వ్యాపారిని పిస్తాల్‌తో కాల్చి చంపేందుకు వెళ్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ప్రాణహిత ఒడ్డున ప్రాక్టీస్!
ఎస్పీ వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని కౌటి- సాండ్గావ్ గ్రామానికి చెందిన కుర్బంకర్ అజయ్.. సులువుగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఓ హిందీ సినిమాతో ప్రేరణ పొందాడు. బాగా డబ్బున్న వారిని బెదిరించి.. భయపెట్టి అవసరమైతే హతమార్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో ఈ ఏడాది జూన్ 11న రాత్రి సమయంలో బెదిరిస్తూ కౌటాలకు చెందిన ఓ వ్యాపారికి లేఖలు రాశాడు. రూ.50 లక్షలు ఇవ్వాలని, లేనిచో కుటుంబ సభ్యులను చంపుతామని రెండు లెటర్లు రాసి సదరు వ్యాపారి ఫెర్టిలైజర్ షాప్‌లో పెట్టాడు. వ్యాపారి స్పందించకపోవడంతో యూట్యూబ్‌లో చూసి పిస్టోలు తపంచా లాంటి మారణాయుధాలు బిహార్‌లో దొరుకుతాయని తెలుసుకున్నాడు.

జూలై చివరి వారంలో అక్కడికి వెళ్లాడు. ఆగస్టు మొదటి వారం వరకు అక్కడే ఉండి బాబు సాహెబ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర రూ. 55 వేలు చెల్లించి ఒక పిస్టోలు, రెండు మ్యాగజైన్లు దీనికి సంబంధించిన 20 బుల్లెట్లు, ఒక తపంచ, దీనికి సంబంధించిన ఒక బుల్లెట్ కొనుగోలు చేశాడు.

అక్కడే షూటింగ్ నేర్చుకున్నాడు. మూడు బుల్లెట్లు అక్కడే ప్రాక్టీస్‌లో ఫైర్ చేసి.. ఖాళీ కోకలను తీసుకుని తన ఇంటికి వచ్చాడు. ప్రాణహిత నది ఒడ్డున ఒక బుల్లెట్ గాలి‌లోకి ఫైర్ చేసి ప్రాక్టీస్ చేశారు. సెప్టెంబర్ 26న కాగజ్‌నగర్ నుంచి మహారాష్ట్రకు వెళ్లే ట్రైన్ ఎక్కి అందులో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ తీసుకొని.. డబ్బులు ఇవ్వాలని వ్యాపారికి ఫోన్ చేశాడు. లేకుంటే చంపేస్తామని బెదిరించాడు.

అయినా సదరు వ్యాపారి స్పందించలేదు. దీంతో అక్టోబర్ 15న రాత్రి వేళలో వ్యాపారి తమ్ముడిని చంపాలని ఉద్దేశంతో పిస్తోల్‌లో రెండు బుల్లెట్లు నింపుకొని మార్గమధ్యలో వేచి చూసి..వ్యాపారి తమ్ముడు రాగానే అతని ముఖం‌పై లైట్ ఫోకస్ పెట్టి అతను అని గ్రహించి ఒక బుల్లెట్ ఫైర్ చేశాడు. ఆ గురి తప్పడంతో అక్కడి నుండి పారిపోయాడు. ఇదే క్రమంలో మంగళవారం ఉదయం సదరు వ్యాపారిని షాపులో‌నే హతమార్చాలనే ప్లాన్ చేశాడు.

పిస్తోల్, మూడు బుల్లెట్ తీసుకుని బైక్‌పై వెళ్తుండగా.. మార్గమధ్యలో ఎన్నికల తనిఖీ చేస్తున్న కౌటాల పోలీసులకు అనుమానం వచ్చి నిందితుడిని పట్టుకున్నారు.

అతని వద్ద నుంచి ఒక పిస్తోల్, ఒక తపంచా (దేశి కట్ట), రెండు మ్యాగజిన్‌లతో పాటు 15 చిన్న బుల్లెట్‌లు, ఒక పెద్ద బుల్లెట్, ఐదు ఖాళీ కోకలు, సెల్ ఫోన్, ఒక బైకు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ వహీదుద్ధీన్, కౌటాల సీఐ సంతోష్, ఎస్ఐ చంద్రశేఖర్, కాగజ్ నగర్ రూరల్ ఎస్ఐ సందీప్ తదితరులున్నారు.