వేద న్యూస్, హైదరాబాద్‌  ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖకు సంబంధించిన చెక్‌ పోస్టుల రద్దు నిర్ణయం బుధవారం నుండి అమలులోకి వచ్చింది. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, అలాగే రవాణా ప్రక్రియలన్నీ పారదర్శకంగా ఆన్‌లైన్‌లో జరిగేలా చూసేందుకు రెండు నెలల క్రితమే ఈ నిర్ణయం తీసుకొని, ఇప్పుడు పూర్తిగా చెక్‌ పోస్టులను మూసివేస్తూ అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) పాలసీ వల్ల రాష్ట్రంలో గణనీయమైన మార్పు వచ్చిందని మంత్రి వెల్లడించారు. ఈ పాలసీ ద్వారా ప్రభుత్వం రూ. 577 కోట్ల టాక్స్‌ను మినహాయించిందని, ఫలితంగా ఈవీ వాహనాల అమ్మకాల వాటా 0.03 శాతం నుంచి 1.13 శాతానికి పెరిగిందని వివరించారు.

ఢిల్లీిలో ఉండే కాలుష్య పరిస్థితి తెలంగాణలో తలెత్తకుండా నిరోధించడానికి ఈ ఈవీ పాలసీని తీసుకొచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఆటోలకు అనుమతి, స్క్రాపింగ్‌ పాలసీ
నగరంలో 20 వేల ఎలక్ట్రిక్‌ ఆటోలకు అనుమతి ఇవ్వగా, ఎల్‌పీజీ మరియు సీఎన్‌జీ ఆటోలకు 10 వేలు చొప్పున అనుమతి ఇచ్చామని మంత్రి తెలిపారు. అలాగే, 25 వేల రెట్రోఫిటింగ్‌ ఆటోలకు (పాత ఆటోలను ఆధునికీకరించడం) అనుమతి ఇచ్చామని చెప్పారు.

రాష్ట్రంలో ఇప్పటికే వాహన్‌ వ్యవస్థ అమలవుతోందని, సారథిని కూడా త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. పాత వాహనాల కోసం స్క్రాపింగ్‌ పాలసీని తీసుకొచ్చామని, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనాలకు రేడియం స్టిక్కర్స్‌ అమలు అయ్యేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

రవాణా శాఖ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌  టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని మంత్రి వెల్లడిరచారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి, అనవసరంగా, రెగ్యులర్‌గా కార్యాలయాలకు వచ్చే వారిని గుర్తించి హెడ్‌ ఆఫీస్‌కు అలర్ట్‌ పంపుతుందని, దీనిని బ్రోకర్‌ వ్యవస్థను నిరోధించడానికి ఉపయోగిస్తున్నామని చెప్పారు. అలాగే, డిపార్ట్‌మెంట్‌లో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, 63 కేంద్రాల్లో కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు.

 రోడ్‌ సేఫ్టీ, కొత్త నియామకాలు
ప్రజలకు రోడ్‌ సేఫ్టీపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని, దీనిలో భాగంగా నాచారంలో గవర్నర్‌ ప్రారంభించిన రోడ్‌ సేఫ్టీ చిల్డ్రన్‌ అవేర్నెస్‌ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నామని, కరీంనగర్‌లో కూడా ప్రారంభించుకున్నామని తెలిపారు.

కాలేజీలలో రోడ్‌ సేఫ్టీ క్లబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో ఆటోమేటిక్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ సిస్టమ్‌ తీసుకొస్తున్నామని మంత్రి వివరించారు. రవాణా శాఖలో రెవెన్యూ కలెక్షన్‌ పెంచేందుకు 112 మంది ఏఎంవీఐలను నియమించి శిక్షణ ఇచ్చామని, నలుగురు ఆర్‌టీఓలు గ్రూప్‌ 1 ద్వారా వచ్చారని తెలిపారు.

చెక్‌ పోస్టుల రద్దు, ఆదాయ వసూలు
చెక్‌ పోస్టులు రద్దు చేసినప్పటికీ వాహనాల్లో అక్రమ రవాణా జరగకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ను ఎక్కువగా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. చెక్‌ పోస్టుల రద్దు చేయాలని తానే ముఖ్యమంత్రి దృష్టికీ తీసుకువెళ్లి కేబినెట్‌లో పెట్టడం జరిగిందని పేర్కొన్నారు.

గత పది సంవత్సరాల్లో (పాత ప్రభుత్వ హయాంలో) పాపాల పుట్ట లాగా అవినీతి జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న 1.7 కోట్ల వాహనాలకు రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకుంటామని, వచ్చే ఆదాయాన్ని ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వివరించారు.