వేద న్యూస్, హైదరాబాద్:
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు అత్యాధునిక హంగులతో కొత్త ఎక్స్ ప్రెస్, లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఘనంగా జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కొత్త బస్సులో కలిసి వారంతా ప్రయాణించారు.
