వేద న్యూస్, పార్వతీపురం మన్నెం జిల్లా:
రైతు గెలవాలి.. వ్యవసాయం నిలవాలనేది తెలుగుదేశం ప్రభుత్వం నినాదం, ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. సీతానగరం మండలం గుచ్చిమి గ్రామంలో అన్నదాత సుఖీభవ రైతు సదస్సులో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద పార్వతీపురం నియోజకవర్గంలో రైతులకు 18 కోట్ల ఆరు లక్షల మొత్తం విడుదల కావడంతో రైతులు సంబరాలు చేసుకున్నారు. రైతులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా రైతులకు ఏడాదికి 20,000 అన్నదాత సుఖీభవ సాయం, ఇప్పుడు 7000 అక్టోబర్లో మరో 7000 జనవరిలో 6000 చొప్పున కేంద్ర ప్రభుత్వంతో కలిపి అందిస్తున్నామని కౌలు రైతులకు కూడా రెండు విడతల్లో 20000 మొత్తం జమ చేస్తారని వెల్లడించారు. రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబుకు రైతుల కష్టాలు తెలుసునని, అందుకే పెద్ద మొత్తంలో సాయం అందిస్తున్నారని తెలిపారు.

అలాగే ధాన్యం అమ్మిన 24 గంటల్లో రైతులు ఖాతాలలో డబ్బులు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెరువులు గడ్డలు, వాగులను బాగు చేయడంతో పాటు సాగునీటి పథకాలను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. గత వైసిపి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని చెరువులను గాలికి వదిలేసిందని విమర్శించారు ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్వతీపురం నియోజకవర్గానికి వచ్చి సాగునీటి పథకాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తారని వెల్లడించారు.

చంద్రబాబు హామీ ఇస్తే ఎంత కష్టమైనా తప్పకుండా నెరవేరుస్తారని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ రైతులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోఐటీడిఎ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, టిడిపి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.