వేద న్యూస్, వరంగల్ క్రైమ్ :
పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి రానున్న పార్లమెంట్ ఎన్నికలను విజయవంతం చేద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారుల పనితీరుపై వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం నెలవారి నేర సమీక్షా సమావేశంతో పాటు, ఎన్నిక నిర్వహణపై పోలీస్ కమిషనర్ సెంట్రల్, ఈస్ట్‌జోన్‌కు చెందిన పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా స్టేషన్ వారిగా పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించాలని అలాగే పెండింగ్ కేసుల్లో నిందితులను పట్టుకొనేందుకుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యంగా నేరానికి పాల్పడిన వారికి శిక్షపడే విధంగా నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేయాలని సూచించారు. గంజాయి, ఆత్యాచారంకు సంబంధించిన కేసుల్లో నాన్ బెయిల్‌బుల్ కేసులు పెట్టి నిందితులను అరెస్టు చేసి కొర్టులో హాజరు పరచాలని అన్నారు.ప్రధానంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి పదిగంటల కల్లా మద్యం దుకాణాలు మూసివేసే విధంగా స్థానిక స్టేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.మద్యం దుకాణాలు గడువులోపు మూసివేసి వున్నాయ లేదా అన్నదానిపై డిసిపి, ఏసిపి స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సి వుంటుందని ఎన్నికల విధుల్లో భాగంగా అధికారులు తమ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్ వర్క్ ఎక్కవ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అధికారులు తమ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తప్పక సందర్శించాలని, అలాగే తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి మౌళిక వసతుల ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, మరిన్ని ఏర్పాట్లకై సంబంధిత అధికారుల సమాచారం అందజేయాలని ముఖ్యంగా పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిసిపిలు రవీందర్, అబ్దుల్ బారి, ట్రైనీ ఐపిఎస్ అధికారులు అంకిత్, శుభంనాగ్, అదనపు డిసిపి రవితో పాటు ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్నారు.