- మాతృమూర్తి ఆకలి ఆర్తనాదాలు బిడ్డలకు వినిపిస్తలేవో?
- బుక్కెడు బువ్వకు భిక్కుభిక్కుమంటున్న గుండెకారి అంబక్క
- మాయమైపోతున్నారమ్మా..కడుపున పుట్టిన సంతానమూ
- వృద్ధురాలి సంరక్షణ మరిచిన బిడ్డలు..
- ఠాణా మెట్లెక్కిన తల్లి.. న్యాయం చేయాలని వేడుకోలు
వేద న్యూస్, కమలాపూర్:
బాగోగులు చూసుకోవాల్సిన కుమారులు పట్టించుకోకపోవడంతో ఆ తల్లి దీనంగా కాలం వెల్లదీస్తున్న దుస్థితి.. ఆ మాతృమూర్తికి ఏడుగురు సంతానం అందులో నలుగురు కుమారులు. పింఛను డబ్బులు తీసుకుని అయినా సరే.. తనకు బుక్కెడు బువ్వ పెట్టాలని తల్లి వేడుకున్నా కొడుకుల్లో ఎవరూ ముందుకు రావకపోవడంతో.. ఆమె పరిస్థితి దయనీయంగా మారింది.
‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు’ అని అందెశ్రీ రాసిన మాటలను ఆ తల్లి పుత్రరత్నాలు అక్షరాలా నిజం చేస్తున్నారు. కని పెంచిన తల్లికి తిండి పెట్టకుండా..ఆమెను క్షోభ పెడుతున్నారు.
అనారోగ్యంతో వంట చేసుకోలేని స్థితి
వివరాల్లోకెళితే..హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన గుండెకారి అంబక్క అనే వృద్ధురాలి దీనగాధ ఇది. ఆమెకు ఏడుగురు సంతానం. అందులో నలుగురు కుమారులు, ముగ్గురు కూతుర్లున్నారు. ఇంతమంది ఉన్నా ఆ తల్లికి బుక్కెడు బువ్వపెట్టేవారే కరువయ్యారు.
ఆ తల్లి చిన్న కూతురు తన భర్త చనిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకొని…పదేండ్ల క్రితం కమలాపూర్‌కి బ్రతుకుతెరువుకు వచ్చారు. అప్పుడు తన తల్లి అంబక్కను కూడా వెంటబెట్టుకుని..ఆనాటి నుంచి బాగోగులు చూసుకుంటూ వచ్చింది.
భర్త కోల్పోయిన ఆమెకు తన ఇద్దరు పిల్లల్ని పోషించడం, చదివించుకోవడమే కష్టంగా మారినా.. ఇన్ని రోజులు ఏదో ఒకలా వెళ్లదీసుకొచ్చింది. ఆర్థిక కారణాలరీత్యా ఆమె కూడా బతుకుదెరువు కోసమని హన్మకొండకు వెళ్లింది. దాంతో వృద్ధురాలు అంబక్క ఎలాగోలా కొంతకాలంగా నెట్టుకొస్తున్నది.
ఇటీవల కాలంలో ఆమెకు ఆరోగ్యం సహకరించక వంట కూడా చేసుకునే ఓపిక లేక గోస పడుతున్నది. వృద్ధురాలి పరిస్థితిని చూసి చలించిన మహిళా సంఘాల వీవోఏ పుల్ల బుజ్జమ్మ కొద్ది కాలం పాటు తన ఇంట్లో ఆశ్రయం కల్పించింది.
కానీ, రోజురోజుకూ ఆ వృద్ధురాలి ఆరోగ్యం ఇబ్బందిగా మారుతుండడంతో ఆమెను చూసుకునే వారే లేకుండా పోయారు. ఈ నేపథ్యంలోనే వృద్ధురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. పోలీసులు, అధికారులు తనకు న్యాయం చేయాలని, తన కుమారులను పిలిపించి తనకు బుక్కెడు బువ్వ పెట్టించేలా చూడాలని ఆ వృద్ధురాలు వేడుకుంటున్నారు.