– 23 ఏండ్లుగా గులాబీ పార్టీకి మహేందర్ కుమార్ సేవలు
– ఈ సారైనా ఆర్‌వీకి టికెట్ ఇవ్వాలని పలు సంఘాల డిమాండ్లు
– బీఆర్ఎస్ పార్టీలో మున్నూరుకాపులకు మొండి చెయ్యేనా?
వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి/గోషామహల్:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టిన ఉద్యమనేతకు ఈసారైనా సరైన గుర్తింపునివ్వాలని పలు సంఘాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. ఈ‘నాటి’ సీఎం కేసీఆర్ కు ఆ‘నాడు’ సమైక్య ఏపీలో అండగా నిలిచిన ఆర్ వీ మహేందర్ కుమార్ సేవలు గుర్తుకు తెచ్చుకోవాలని అంటున్నారు. ఆనాడు గోషామహల్ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి గా ఆర్ వీ మహేందర్ కుమార్ పటేల్ పార్టీ కోసం పని చేశారని వివరిస్తున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత కూడా ఆర్ వీ మహేందర్ కుమార్..బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. నిత్యం రాష్ట్రసర్కార్ చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను, గడప గడపకు చేరవేస్తూ, బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ, స్థానిక ప్రజలతో, పార్టీ నాయకులతో శభాష్ అనిపించుకుంటున్నారు.
ఉద్యమనేతగానే కాకుండా రాజకీయ నాయకుడిగానూ ప్రజల మెప్పు పొందుతున్న ఆర్ వీ మహేందర్ కుమార్ కు ఈసారి గోషామహల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. ఉద్యమనేతగా నిత్యం ప్రజల్లో ఉండే ఆర్ వీ మహేందర్ కుమార్ కు ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని అంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అసలు ఎందుకు ఉద్యమనేత ఆర్ వీ ని విస్మరిస్తోందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికలకు సమయం వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గోషామహల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఆర్ వీకి కేటాయించాలని కోరుతున్నారు.