- మీటింగ్ సక్సెస్ చేయండి: మండల ఇన్చార్జి అనిల్
వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఈనెల 7న(గురువారం) హసన్ పర్తి మండలం లోని చింతగట్టు క్రాస్ దగ్గర ఎంపీఆర్ గార్డెన్లో వికలాంగుల, చేయూత పెన్షన్‌దారుల పెన్షన్లను పెంచాలనే డిమాండ్ తో మహా సభ జరగనుంది. ఈ మీటింగ్‌కు ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతారని ఎమ్మార్పీఎస్ ఎల్కతుర్తి మండల ఇన్ చార్జి అడ్డూరి అనిల్ మాదిగ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒకటైన వికలాంగుల , వృద్ధుల , వితంతువుల , ఒంటరి మహిళల , చేనేత , బీడీ , గీత కార్మికుల పెన్షన్లు పెంచుతామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. లేనిపక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వికలాంగులకు రూ. 4000 నుంచి రూ.6000 పెన్షన్ పెంచుతానని, వృద్ధులు , వితంతువులు , ఒంటరి మహిళలు , చేనేత , బీడీ , గీత కార్మికులకు రూ.2000 నుంచి రూ.4000 చేస్తానని చప్పారని గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క రూపాయి పెన్షన్ పెంచకపోగా, నాలుగు నెలల పెన్షన్ ఎగ్గొట్టారని, పెన్షన్ దారులను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. పెన్షన్లు పెంచి ఇచ్చే వరకు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో పెన్షన్ దారులందరినీ ఐక్యం చేసి పోరాటం చేస్తామని దానిలో భాగంగానే ఈనెల 13న ‘చలో హైదరాబాద్’ పేరుతో లక్షలాది మందితో వికలాంగుల చేయూత పెన్షన్ దారుల మహా గర్జన ఉంటుందని వెల్లడించారు.
దాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఈ నెల 7న జిల్లా మహాసభను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండల పరిధిలోని ప్రతి గ్రామం నుండి వందలాదిగా వికలాంగులు , వృద్ధులు , వితంతువులు , ఒంటరి మహిళలు , చేనేత , బీడీ , గీత కార్మికులు పెన్షన్ దారులు , కండరాల క్షీణతతో పూర్తిగా మంచానికి పరిమితమైన వికలాంగులు అందరూ సభకు విచ్చేసి విజయవంతం చేయాలని అనిల్ మాదిగ కోరారు.