•  లయబద్ధమైన సంగీతానికి తోడు అర్థవంతమైన లిరిక్స్
  •  ఆలోచన రేకెత్తించేలా ‘నమ్మాలో..నమ్మొద్దో తెలుస్తలేదురో’ పాట

వేద న్యూస్, జమ్మికుంట:
కళ.. కళ కోసం కాదు.. సమాజం కోసం.. నిద్రాణమైన సమాజాన్ని తట్టి లేపి అభ్యుదయం దిశగా పయనించేలా చేయడం కోసం.. కాగా, అలా కళాకారుడిగా కవి స్పృశించని చోటు ఉండబోదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘రవిగాంచని చోట కవిగాంచును’అనే నానుడిని అక్షరాలా నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాడు ఈ యువకవి.

నేటి సమాజంలో జరుగుతున్న వివాహేతర హత్య ఉదంతాలపై సదరు యువకవి..పుల్లూరి సమ్మయ్య కలం నుంచి వచ్చిన ‘నమ్మాలో..నమ్మొద్దో తెలుస్తలేదురో’ పాట యూట్యూబ్ వేదికగా తాజా విడుదలయింది. ఈ పాట ప్రజలలో ఆలోచన రేకెత్తించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నేటి సమాజ పోకడకు  పాట రూపునిచ్చి.. అంతటితోనే ఆగిపోకుండా ‘మార్పు’ ఎక్కడ రావాలి? అనే విషయమై ముగింపు సైతం చక్కగా తెలపడం విశేషం.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా వేల్లంపల్లి గ్రామవాసి పుల్లూరి సమ్మయ్య.. పాటల గనిగా ముందుకు సాగుతున్నారు.

చక్కటి ముగింపు!
‘భర్త భార్యను హత్య చేయడం’, ‘భార్య భర్తను హత్య చేయడం’, ’ప్రియుడి కోసం భర్తను ప్లాన్ చేసి మర్డర్ చేయించిన వైఫ్’ వంటి ఘటనలు ఇటీవల కాలంలో వరుసగా జరిగాయి. అలాంటి ఘటనల నేపథ్యాన్ని పాటలో ఆవిష్కరించారు. ‘నమ్మాలో..నమ్మొద్దో తెలుస్తలేదురో’, ‘నమ్మినోడు భూమ్మీద లేడురో’ అంటూ తెలంగాణ యాసలో సత్యాన్ని చెబుతూ పాటను కొనసాగించారు.

ఏ రకంగా కొందరు హత్యలకు పూనుకుంటూ కట్టుకున్న భర్తను కాటికి పంపుతున్నారు? ఎవరి మోజులో పడి ఏడు అడుగులు నడిచి ఎలా మోసం చేస్తున్నారు? ఇదంతా వరుసగా చోటు చేటుకున్న నేటి సమాజ వికృత పోకడను కండ్లకు కట్టినట్టుగా పాటలో తెలిపే ప్రయత్నం చేశారు.

కొందరి వికృత తీరు వల్ల నమ్మకం కోల్పోతున్న సందర్భాన్ని ఉదహరిస్తూనే..‘ఆమె’నే నమ్మకం అయి నేలన నిలవాలని ఆకాంక్షిస్తూ.. మగువను మొక్కేటి రోజులు రావాలి అంటూ.. పాటను ముగించారు. ఈ ‘నమ్మాలో..నమ్మొద్దో తెలుస్తలేదురో’ పాటను సామాజిక కార్యకర్త అంబాల రజనీకాంత్ ప్రొడ్యూస్ చేశారు.

పుల్లూరి సమ్మయ్య లిరిక్స్ అందించారు. ప్రశాంత్ ఓరుగంటి సంగీతం అందించగా, ‘రంగస్థలం’ సింగర్ రేల కుమార్ ఆలపించారు. రిథమిస్ట్‌గా షేక్ వాజిద్ హుస్సేన్ వ్యవహరించగా, రాజేశ్ పటేల్ ఎడిటింగ్ చేశారు.

ఈ పాట ‘పుల్లూరి పాట’ చానల్‌లో విడుదల అయింది. పాట విడుదల సందర్భంగా దాసారపు నరేశ్, కేథపాక రత్నాకర్, బానోతు దేవేందర్, దాసారపు సదానందంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.