- పక్షుల పరిరక్షణపై పాఠశాల విద్యార్థులకు అవగాహన
- వరంగల్ అటవీ శాఖ మరియు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం
వేద న్యూస్, పాకాల / నర్సంపేట:
జాతీయ పక్షుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పాకాల అభయారణ్యంలో వరంగల్ అటవీ శాఖ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ (ఔల్స్) సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు పక్షులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల అభయారణ్యంలోని పక్షుల జీవవైవిధ్యం, వాటి ఆవాసాల పరిరక్షణ మరియు స్థానిక జీవజాతుల విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు.
ప్రతి ఏటా శీతాకాలంలో పాకాల సరస్సుకు విదేశాల నుండి వచ్చే వివిధ రకాల వలస పక్షుల గురించి మరియు పాకాల సరస్సు యొక్క పర్యావరణ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేటలోని మదర్స్ ల్యాండ్ పాఠశాలకు చెందిన సుమారు 100 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పక్షుల పట్ల ఆసక్తిని పెంచేందుకు విద్యార్థులకు ‘బర్డ్స్ ఆఫ్ తెలంగాణ’ అనే ఛాయాచిత్రాల పుస్తకాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రకృతిలో పక్షుల పాత్ర అత్యంత కీలకమని, వాటి ఆవాసాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. భావి తరాలకు పర్యావరణంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు.
కార్యక్రమంలో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షులు ఇందారం నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చెలుపూరి శ్యామ్ సుందర్ శర్మ, సంయుక్త కార్యదర్శి పిట్టల రవిబాబు, అటవీశాఖ అధికారి ధర్మ, పాఠశాల ఉపాధ్యాయులు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
