వేద న్యూస్, మహబూబాబాద్/ మరిపెడ:
స్వాతంత్ర్య సమరయోధులు సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా “జాతీయ ఐక్యత దినోత్సవం”ను మంగళవారం మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. జాతీయ ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఫొటోకు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం సిబ్బందితో ఏక్తా దివాస్ ప్రతిజ్ఞను జిల్లా ఎస్పీ, ఐపీఎస్ అధికారి డా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 31ని రాష్ట్రీయ ఏక్తా దివాస్ గా నిర్వహిస్తామని చెప్పారు. పటేల్ తో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, కానీ, నిజాం పాలనలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రానికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ పోరాట ప్రతిభతో 1948 సెప్టెంబర్ 17న భారత దేశంలో విలీనం అయినట్లు వివరించారు.

వందలాది సంస్థానాలను ఒక్కటి చేసిన మహనీయుడికి ఘననివాళి అర్పిస్తూ, జాతి సమైక్యతకు పునరంకితమై మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, ఏ. ఆర్ డిఎస్పి విజయ్ ప్రతాప్, ఐ.టి.సెల్ డీఎస్పీ శ్రీనివాస్, ఇన్ స్పెక్టర్ నరేందర్, ఎస్‌బి ఇన్ స్పెక్టర్ లు బాలాజీ వరప్రసాద్ , డీసీఆర్బీ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ , ఆర్.ఐ.లు భాస్కర్, అనిల్, సోములు ఆఫీసు సూపరింటెండెంట్స్, సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.