- రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత
- తీవ్ర అసహనం వ్యక్తం చేసిన భక్తులు
వేద న్యూస్ ,వేములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల దర్శనాలు నిలిచిపోయాయి.
ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపివేశారు. అయితే అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా దర్శనాలకు అనుమతి ఇవ్వడం లేదని, ఈ విషయం ముందే తెలిస్తే తాము ఇంత దూరం వచ్చే వాళ్ళం కాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరోవైపు భీమేశ్వర ఆలయంతో పాటు ఆలయ ముందు భాగంలో ఉన్న ప్రచార రథం వద్ద స్వామివారిని దర్శించుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే రాజన్నను దర్శించుకోవడానికి వస్తే ఇలా చేయడం ఎంతవరకు సరైనది అంటూ పలువురు భక్తులు ప్రశ్నించారు.
కళ్యాణ కట్ట, ధర్మగుండం అక్కడ ఉంటే అక్కడి నుండి భీమన్న ఆలయానికి వెళ్ళి దర్శించుకోవాలని అధికారులు సూచిస్తున్నారని అంతా దూరం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.