•  వేద న్యూస్ కథనానికి స్పందన
  • రోడ్డు ప్రమాదాల పై స్పందించిన ఆర్అండ్ బి అధికారులు

వేద న్యూస్, కమలాపూర్: 

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద  పరకాల – హుజురాబాద్ ప్రధాన రహదారి పై ఉన్న స్పీడ్ బ్రేకర్ వల్ల పెద్ద సంఖ్యలో నిత్యం వరుస ప్రమాదాలు జరుగుతుండగా వాహనదారులు తీవ్రంగా గాయపడుతున్నారు. ఈ ప్రమాదాలలో మహిళలు, చిన్నపిల్లలు సైతం తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.ఈ స్పీడ్ బ్రేకర్ వల్ల వాహనదారులకు ఉత్పన్నమవుతున్న సమస్యపై వేద న్యూస్ తెలుగు దినపత్రిక శనివారం “నెత్తు రో(డ్డు)డుతున్న రహదారి” అనే శీర్షికతో కథనం ప్రచురితం చేసింది.

దీంతో ఆర్ అండ్ బి అధికారులు స్పందించి బుధవారం కమలాపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండె బాబు, కమలాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ, ఆర్ అండ్ బి డిఈ రాజు, ఏఈ జయశ్రీ ప్రమాదాలు సంభవిస్తున్న సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీలైనంత త్వరగా స్పీడ్ బ్రేకర్ సమస్యను పరిష్కరిస్తామని, వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.