- కలెక్టరేట్ కార్యాలయంలో పురుగుల మందు తాగిన వృద్ధుడు
వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల:
కొడుకు, కోడలు పోషించడం లేదని మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలానికి చెందిన అజ్మీరా విఠల్ అనే వ్యక్తి సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో విఠల్ తన భార్య విరవ్వతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చాడు. తన కుమారుడు నరేష్ నాయక్, కోడలు తమను సరిగా పోషించడం లేదని, ఉన్న భూమిని కూడా వారే సాగు చేసుకుంటూ తమకు అన్నం పెట్టడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.
స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ క్రమంలోనే, మనస్తాపానికి గురైన విఠల్ అక్కడే పురుగుల మందు తాగాడు.
వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విఠల్ అక్కడ చికిత్స పొందుతున్నాడు.