•  మితిమీరిన జోక్యంపై సర్కారు సీరియస్!

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:

అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ వద్ద ప్రైవేటు ఓఎస్డీగా పని చేస్తున్న సుమంత్ వ్యవహారం వివాదాస్పదంగా ఉందని తీవ్ర ఆరోపణలు రావడంతో ఓఎస్డీ పోస్టు నుండి తొలగించినట్లు తెలుస్తోంది. ఆరోపణలపై ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక అందించగా, సర్కారు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నది.

 

అటవీశాఖలో ఉద్యోగుల బదిలీలు, ఆయా ఉద్యోగులు కొందరిని ఇతర శాఖలకు డిప్యుటేషన్ పై హెచ్ఎండీఏకు పంపిన విషయంలోనూ, అలాగే జిల్లాల వారీగా బదిలీలు చేసే విషయంలోనూ సుమంత్ హవా కొనసాగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అంతా తానై దేవాదాయ శాఖ వ్యవహారాల్లోనూ కలగజేసుకోవడం ఆ శాఖాధికారులను విస్మయానికి గురిచేస్తోంది.

హెచ్ఎండీఏలోనైతే వారికి సమాచారం లేకుండానే అటవీశాఖ నుంచి డిప్యుటేషన్ మీద ఆర్డర్లు తీసుకుని మరీ వచ్చి షాక్ ఇచ్చారు. దేవాదాయ శాఖలోనైతే ఉద్యోగుల బదిలీలు మరీ గమ్మతుగా జరుగుతున్నాయని, ఆయన అనుగ్రహం ఉంటే చాలు.. కోరుకున్న చోట కోరుకున్న పోస్టు దక్కుతుందని ఆ శాఖలోని కొందరు బహిరంగంగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తతే రాష్ట్ర కాలుష్య నియంత్రణా మండలి అధికారులతోనూ, అక్కడ జరుగుతున్న లావాదేవీలు కాలుష్య కారక పరిశ్రమలకు ఈ ఓఎస్డీ  వంతపాడటం కూడా నివేదికలో పొందపచ్చారు.

ఆయా పరిశ్రమలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే బేరసారాలు, టాస్క్ ఫోర్స్ మీటింగ్‌లో  వివరాలు తెలుసుకోవటం, ఆయా కాలుష్య కారక పరిశ్రమల నుంచి అందిన కాడికి దండు కోవడం లాంటి అంశాలు రాష్ట్ర రసాయన పరిశ్రమ సమాఖ్యలో హాట్ టాపిక్ గా మారాయి.

తెలంగాణ ఏర్పడ్డాక ఈవిధంగా పర్యావరణ శాఖకు సంబంధించిన అంశాల్లో ఓ ప్రైవేటు వ్యక్తి ఈ స్థాయిలో కలగచేసుకోవటం దీనికి ఆ శాఖ మంత్రి సహకరించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  సాధారణంగా కాలుష్య నియంత్రణ మండలి వ్యవహారాలు సాంకేతికంగానూ న్యాయస్థానాల పరిశీలనలోని అంశాలు కలిగి ఉంటాయి. అందులోనూ ఫార్మా పారిశ్రామికవేత్తల లాబీయింగ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత స్థాయిలోనే జరుగుతుంటుంది. ఇంత భారీ లాబీయింగ్ జరిగేచోట ఐఏఎస్ అధికారులు సైతం సిఫార్సు చేయటానికి జంకుతారు. అటువంటిది సాధారణ ప్రభుత్వ ఉద్యోగి కూడా కాని.. కేవలం ఓ మంత్రికి ప్రైవేటు ఓఎస్టీగా వచ్చి అధికార కార్యకలాపాల్లో తన మంత్రి ఇచ్చిన చనువుతో జోక్యం చేసుకోవడం మితమీరింది.

ఐఏఎస్ స్థాయి వ్యక్తులకు దిశా నిర్దేశం చేయటం, ఆపై పర్యావరణ పరిరక్షణ విషయంలో కలుషిత వాతావరణం సృష్టించటం లాంటి తీవ్రమైన అభియోగాలు ఈ ఓఎస్డీపై వచ్చాయి. నిత్యం అతను జరిపే లావాదేవీలు, కాల్ డేటాను అతను వ్యక్తి గతంగా జరిపే సమీక్షలపై నిఘాపెట్టి సేకరించిన సమాచారం నివ్వెరపోయే వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది.

ఇన్ని ఆరోపణలు ఉండడం తో సీఎం ఇన్వాల్వ్ అయ్యారని సమాచారం. అతని పై ప్రత్యేక నిఘా పెట్టి పూర్తి సమాచారం అందడంతో ఆ ప్రైవేటు వ్యక్తీ నీ సీఎస్ ద్వారా డైరెక్ట్‌గా తీసివేశారని సమాచారం. తీసేసేవరకు సంబంధిత మంత్రికి కూడా ఈ విషయం తెలియకపోవడం గమనార్హం.