వేద న్యూస్, మంచిర్యాల:

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని అటవీ ప్రాంతమైన కర్ణపేటలో అటవీశాఖ ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో అడవుల సంరక్షణ మరియు వన్యప్రాణుల రక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా అటవీ అధికారులు మరియు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ… కింది కీలక అంశాలను ప్రజలకు వివరించారు.

అడవి మంటల నివారణ:
వేసవిలో చిన్న నిప్పు రవ్వ వల్ల అడవి మొత్తం తగలబడే ప్రమాదం ఉందని, ఉద్దేశపూర్వకంగా అడవికి నిప్పు పెట్టడం భారత అటవీ చట్టం ప్రకారం నేరమని హెచ్చరించారు. అడవి తగలబడటం వల్ల పర్యావరణంతో పాటు అడవిలోని చిన్న చిన్న జీవులు, పక్షులు ఆహుతి అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వన్యప్రాణుల వేటపై నిషేధం:
ఎండల తీవ్రతకు దాహార్తిని తీర్చుకోవడానికి అడవిలోని నీటి కుంటల వద్దకు లేదా గ్రామాలకు సమీపంలోకి వచ్చే వన్యప్రాణులను వేటాడటం చట్టరీత్యా నేరం. ముఖ్యంగా పొలుసు పంది (పంగోలిన్), దుప్పులు, నెమళ్లు మరియు ఇతర అడవి జీవులను వేటాడితే ‘వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972’ ప్రకారం కనీసం 3 నుండి 7 ఏళ్ల జైలు శిక్ష మరియు భారీ జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.

ప్రజల బాధ్యత:
అడవి మనందరి సంపద అని, అడవి బాగుంటేనే సకాలంలో వర్షాలు పడతాయని తెలిపారు. స్మగ్లర్లు లేదా వేటగాళ్ల మాటలు నమ్మి గిరిజన ప్రజలు మోసపోవద్దని, ఏదైనా అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

అడవి బిడ్డలుగా అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వన్యప్రాణులకు హాని కలిగించకుండా వాటిని స్వేచ్ఛగా బతకనిద్దాం” అని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు ,సిబ్బంది ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులు మరియు స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *