వేద న్యూస్, సూర్యాపేట ప్రత్యేక ప్రతినిధి :
కాలేశ్వరం ప్రాజెక్టు కులేశ్వరంగా మారిందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పదేళ్ల కాలంలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ అని మాయమాటలు చెప్పి బిఆర్ఎస్ నాయకులు వేలకోట్ల రూపాయల దోచుకున్నారని దుయ్యబట్టారు.
కాలేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్లు వ్యయంతో ఖర్చుపెట్టి కడితే మూడు సంవత్సరాలకే కూలిపోయిందని అన్నారు. 18 నెలల పరిపాలనలో రైతుల సంక్షేమం గురించి ఆలోచించిన మహా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున రైతుల సంక్షేమం గురించి ఆలోచన చేయలేదన్నారు.9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతుల భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిందని చారిత్రాత్మక రికార్డ్ అని అన్నారు.
రైతుల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం మనీ స్పష్టం చేశారు. పేదలకు ఉచిత సన్న బియ్యం దేశంలోనే చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిందని అభిప్రాయపడ్డారు. ఒక్కొక్క వ్యక్తికి 6 కేజీల ఉచిత బియ్యం అందజేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
జగన్ కు మేలు చేసే విధంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వేలకోట్ల రూపాయలు సంపాదించారని శంషాబాద్ సమీపంలో 90 ఎకరాల గెస్ట్ హౌస్ నిర్మాణం చేసుకున్నారని విమర్శించారు. సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ ఊర రామమూర్తి, ధారావత్ వెంకన్న, ఫారుక్, జ్యోతి కరుణాకర్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.