వేద న్యూస్, నేరేడుచర్ల :
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను తక్షణమే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమ సహచరులతో కలిసి పాత్రికేయులతో గత మూడు నెలలుగా జీతాలు లేక ఉపాధి హామీ ఉద్యోగులు అల్లాడుతున్నారని నిన్నటి రోజున ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో ఒక ఉద్యోగి ఈఎంఐ కట్టలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలచివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా సమయంలో ఉపాధి హామీ పథకం పేదల పాలిటకల్ప వృక్షంగా మారిందని అనేక మంది పట్టణ ప్రాంతంలో జీవిస్తున్న కార్మికులు సొంత గ్రామాలకు వెళ్లి ఉపాధి హామీ పథకంలో పనిచేసి తాత్కాలికంగా తమ ఆకలిని తీర్చుకున్నారని అన్నారు. అలాంటి ఉపాధి హామీ పథకాలు ఎత్తి వేసేందుకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ప్రశ్నించారు.
ఉపాధి హామీ పథకం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తి వెయ్యడానికి అన్ని రకాల వ్యూహరచనలు చేస్తున్నదని, కానీ కేంద్రానికి వెసులుబాటు కాక ఉపాధి హామీ కూలీల పట్ల ఉపాధి హామీ ఉద్యోగుల పట్ల కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తూ ఉపాధి కూలీలకు ప్రతివారం డబ్బులు వారి ఖాతాలో వేయకుండా ఉద్యోగులకు ప్రతినెల జీతాలు చెల్లించకుండా నానా అవస్థలు పెడుతున్నదని ఇట్టి విషయాన్ని యావన్మంది ప్రజానీకం గుర్తించాలని ఆయన కోరారు. ఆయన వెంట వ్యవసాయ కర్ణ సంఘం సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి రావుల సత్యం, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలక రాజు, శ్రీను ఉన్నారు.