కలెక్టర్‌ డాక్టర్ సత్య శారద

వేద న్యూస్, వరంగల్ :

వరంగల్ జిల్లాలో ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్ సత్య శారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా ఈనెల 1 నుండి 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 11వ విడత ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బాల కార్మికులు భిక్షాటన వెట్టిచాకిరీల నుంచి చిన్నారులకు విముక్తి కల్పించి వారికి పునరావతం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దుకాణాలు, హోటళ్లు, పరిశ్రమల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారిని బాలసదనంలో చేర్పించాలన్నారు. 14 సంవత్సరాల్లోపు పిల్లలతో పని చేయిస్తున్న యజమానులపై కేసులు నమోదు చేయాలన్నారు. మార్కెట్, ఇటుకల తయారీ, స్టోన్‌ కంపెనీలు, క్రషర్‌ కంపెనీల్లో పనిచేస్తున్న బాలకార్మికులను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించాలని, ఆ దిశగా బాలల రక్షణకమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. బడికి దూరంగా ఉన్న పిల్లలు, మధ్యలో బడి మానేసిన పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఏనుమాముల మార్కెట్ ప్రాంతంలో మార్కెటింగ్, కార్మిక శాఖల అధికారులు సర్వే నిర్వహించి కార్మికుల పిల్లలను గుర్తించి వారి మాతృభాషలో విద్య నేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో జులై 1వ తేదీ నుండి నేటి వరకు 30 మంది బాల కార్మికులను రక్షించి వారిని శిక్షించే ఇప్పించడం, పునరావాసం కల్పించడం జరిగిందని అధికారులు తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి జడ్పీ సీఈఓ రామిరెడ్డి,జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివరావు , విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ వసుధ యాంటీ హ్యూమన్ ట్రాఫ్లికింగ్ యూనిట్, చైల్డ్ లైన్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.