•  జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి

వేద న్యూస్, హుజురాబాద్:
రాష్ట్రంలో సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే రాష్ట్రప్రభుత్వం విడుదల చేయాలని జనతాదళ్ (సెక్యులర్) పార్టీ (జేడీఎస్) రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హుజూరాబాద్ పట్టణంలో నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా గ్రామాల అభివృద్ధి పనుల కోసం సర్పంచులు అప్పులు తీసుకొచ్చి పనులు చేశారని ఆయన గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన సర్పంచుల బిల్లులను వెంటనే..నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. ఇదే బిల్లుల విషయమై రాష్ట్రంలో చాలామంది సర్పంచులు మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్య వైఖరిని విడనాడి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వాసు కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కల్లేపల్లి జంపయ్య, సంధ్యేల వెంకన్న, మారముళ్ల కిరణ్ , తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర కుమార్, పెండ్యాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.