వేద న్యూస్, చిల్పూరు: చిల్పూరు మండలం చిన్నపెండ్యాల గ్రామంలో గ్రామదేవత పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్లు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.ఆలయంలో పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. బోనాల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. డప్పుల మోతలు, భక్తుల సందడి మధ్య పోచమ్మ బోనాల వేడుకలు కన్నుల పండువగా సాగాయి.
