వేద న్యూస్, జమ్మికుంట:
మిలీనియం శ్రీనివాస్ డ్యాన్స్ అకాడమీ 25 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా కేఎంఎస్ డ్యాన్స్ స్టూడియో, శుభమస్తు ఈవెంట్స్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని కళాభవన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి నృత్య పోటీల్లో జమ్మికుంటకు చెందిన ప్రసంగి డాన్స్ స్టూడియో అండ్ ఫిట్‌నెస్ సెంటర్ విద్యార్థులు అసాధారణ ప్రతిభను ప్రదర్శించి పలు బహుమతులు కైవసం చేసుకున్నారు.

 

7 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల జూనియర్ విభాగంలో నిర్వహించిన ఫోక్ డాన్స్, వెస్ట్రన్ డాన్స్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రతిభావంతుల మధ్య ప్రసంగి డాన్స్ స్టూడియో విద్యార్థులు ప్రత్యేక గుర్తింపు పొందడం విశేషం.

ప్రసంగి డాన్స్ స్టూడియో విద్యార్థుల బహుమతులు:
ప్రకృతికి జూనియర్ సోలో ఫోక్ డాన్స్ విభాగంలో ప్రథమ బహుమతి, రసగ్నా టీమ్(అవికా, సుధీక్ష, శ్రీనిధి, ప్రకృతి, లాస్య)కు జూనియర్ ఫోక్ గ్రూప్ డాన్స్ విభాగంలో ద్వితీయ బహుమతి,లాస్యకు జూనియర్ సోలో డాన్స్ విభాగంలో తృతీయ బహుమతి లభించింది. విద్యార్థుల నృత్య ప్రదర్శనల్లో లయ, భావవ్యక్తీకరణ, శరీర నియంత్రణ, వేదికపై ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించాయని న్యాయనిర్ణేతలు ప్రశంసించారు. ఈ విజయం ప్రసంగి డాన్స్ స్టూడియోకే కాకుండా జమ్మికుంట పట్టణానికి గర్వకారణంగా నిలిచింది.

ఈ విజయాల వెనుక డాన్స్ మాస్టర్ల కృషి, శిక్షణ విధానం కీలకమని పలువురు అభిప్రాయపడ్డారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో నృత్యంపై ఆసక్తి, క్రమశిక్షణ, పోటీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్న విధానం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమానికి సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల నృత్య ప్రదర్శనలను తిలకించి మంత్రముగ్ధులయ్యారు. జమ్మికుంట నుంచి రాష్ట్రస్థాయికి ఎదిగిన ఈ ప్రతిభ భవిష్యత్తులో జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలని ఆయన ఆకాంక్షిస్తూ విద్యార్థులు, మాస్టర్లను ప్రత్యేకంగా అభినందించారు.

హైకోర్టు న్యాయవాది, డాన్స్ మాస్టర్ కట్టా రమేష్, సినిమా కాస్టింగ్ డైరెక్టర్ రామకృష్ణ, న్యాయనిర్ణేత జూపాక ఉమా మహేశ్వర్ తదితరులు ప్రసంగి డాన్స్ స్టూడియో విద్యార్థులు మరియు శిక్షకులను అభినందిస్తూ, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ప్రసంగి డాన్స్ స్టూడియో అండ్ ఫిట్‌నెస్ సెంటర్ ప్రొప్రైటర్ ఎన్. శ్రీలత, డాన్స్ మాస్టర్లు ప్రసంగి, కే. విశ్వరాజ్ విజేతలను అభినందించారు.

‘ప్రసంగి’ స్టూడియోకి రండి: శ్రీలత
ఈ సందర్భంగా ఎన్. శ్రీలత సోమవారం మాట్లాడుతూ..జమ్మికుంటలో ఉన్న ప్రసంగి డాన్స్ స్టూడియోకు జమ్మికుంటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల చిన్న పిల్లలు, యువత, పెద్దవారు కూడా వచ్చి నృత్యాన్ని అభ్యసించాలన్నారు.

నృత్యం ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జమ్మికుంట, పరిసర ప్రాంతాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.