వేద న్యూస్, బ్యూరో:

క్షణాకావేశం లేదా ఏదైనా కుటుంబ, వ్యక్తిగత ఇతర గొడవ, ఘర్షణ, కలహాలు లేదా ఇతర కారణాల వల్ల పురుగుల మందు తాగి కొందరు తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఆ సంగతి తెలిసిన వెంటనే పక్కనే ఉన్న వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆందోళన చెందుతున్నారు. పురుగుల మందు తాగిన వారిని రక్షించేందుకు ఏం చేయాలో తెలియక భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే వారికి చేయాల్సిన ప్రాథమిక చికిత్స గురించి ప్రముఖ వైద్యుడు, ఎండీ జనరల్ ఫిజీషియన్, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఊడుగుల సురేశ్ వివరించారు. అవేంటో చదివి మీరూ తెలుసుకోండి. అయితే, ఇది అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ప్రాథమిక మార్గదర్శకాలు మాత్రమేనని, ఎప్పటికప్పుడు వైద్యసహాయం తీసుకోవడం తప్పనిసరి అని డాక్టర్ స్పష్టం చేశారు.

విషసేకరణ విధానం గుర్తించాలి

బాధితుడు తీసుకున్న విష(మందు) సేకరణ విధానాన్ని తొలుత గుర్తించాలి. మౌఖికంగా (నోటి ద్వారా) మందులు, రసాయనాలు తీసుకున్నారా? లేదా శ్వాస ద్వారా – వాయువు, పొగ ద్వారా తీసుకున్నారా? లేదా చర్మం/కళ్ల ద్వారా పురుగుల మందు చల్లినపుడు చేతి /కళ్ల మీద పడిందా? తీసుకున్న మందు పత్తి లేదా పురుగుల లేదా గడ్డి మందా? ఏది అనేది ఐడెంటిఫై చేయాలి.

ఇవీ చేయవలసిన పనులు

బాధితుడిని ప్రశాంతంగా ఉంచాలి. విషాన్ని తీసుకున్న సమయం, పరిమాణం తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. బాధితుడి నోటి దగ్గర ఎలాంటి మందుల మూత, డబ్బా ఉన్నా అది వెంటనే తీసుకుని వైద్యుడికి చూపించాలి. ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి.

ఇలా చేయకూడదు..

పురుగుల మందు తీసుకున్న బాధితుడి చేత ఎట్టి పరిస్థితుల్లో ఉలికిపాటు(కక్కించడం) చేయించకూడదు. ఒకవేళ అలా చేస్తే తీసుకున్న విషం(మందు) శ్వాసనాళంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. బాధితుడికి పాలు ఇవ్వకూడదు. ఎందుకంటే మిల్క్ కొన్ని విషాలతో ప్రతికూలంగా పని చేస్తుంది. ఫలితంగా బాధితుడి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

స్వచ్ఛమైన గాలితో కూడిన ప్లేస్‌కు తీసుకెళ్లాలి

బాధితుడు ఒకవేళ శ్వాస (వాయు, పొగ) ద్వారా విషం(మందు) తీసుకున్నట్టయితే వెంటనే బాధితుడిని స్వచ్ఛమైన గాలితో కూడిన ప్రదేశానికి తీసుకెళ్లాలి. సదరు బాధితుడికి శ్వాస తీసుకోవడం ఆగిపోయినట్లయితే సీపీఆర్ (కృత్రిమ శ్వాస) చేయాలి. వెంటనే వైద్యుడి వద్దకు స్థానిక ఆస్పత్రికి తరలించాలి. అలాగే బాధితుడు ఒకవేళ చర్మం లేదా కళ్ల ద్వారా విషం(మందు) సేకరించినట్లయితే నీటితో కళ్లను లేదా చర్మాన్ని కనీసం 15 నిమిషాల పాటు బాగా కడగాలి. దెబ్బతిన్న వస్త్రాలు తీసివేయాలి. ఈ ప్రాథమిక చర్యల అనంతరం వెంటనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి.