- సిటీ కాలేజీలో ‘‘రాజ్యాంగంలోని సాంకేతిక, సంక్లిష్ట పదాల బోధనాయోగ్యత’’పై సదస్సు
వేద న్యూస్, చార్మినార్:
రాజ్యాంగ పరిరక్షణనే అందరి ధ్యేయం కావాలని ప్రముఖ విద్యావేత్త, రాజనీతి శాస్త్రవేత్త, టీజేఎస్ అధ్యక్షులు ఆచార్య కోదండరాం పిలుపునిచ్చారు. హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కళాశాలలోని రాజనీతి శాస్త్ర విభాగం, కమీషన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ, ఢిల్లీ సంయుక్తంగా ఈ నెల 3, 4 తేదీలలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపుసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
వలసపాలనకు వ్యతిరేకంగా స్వయంపాలన కోసం జరిగిన పోరాటంలో నుండి రాజ్యంగ అవసరం ఏర్పడిందని చెప్పారు. వ్యవస్థలో ఉన్న అనేక వైరుధ్యాల వల్ల సమాజం వెనుకబడి ఉందని, రాజ్యాంగం మాత్రం ఎంతో ముందు ఉందని అన్నారు.
రాజ్యాంగంలోని స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం పదాలను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అందువల్ల ఇలాంటి ఆదర్శ భావనలను జీవితంలో అంతర్భాగం చేసుకుని ఆచరించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
రాజ్యాంగ పరిభాష అర్థమయినట్టుగా ఉంటుందని కానీ, అర్థం కాదన్నారు. దీనిని రాజ్యం తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటుందని, అందువల్లనే రాజ్యాంగ పరిభాషకు, నిత్య జీవన భాషకు సంబంధం ఉండాలని చెప్పారు. నాగరిక జీవితం గడపాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సూత్రాలను పాటించాలని, రాజ్యాంగ సూత్రాలకనుగుణంగా సమాజం నిర్మాణం జరగాలని వెల్లడించారు.
రాజ్యాంగం చిత్తశుద్ధితో అమలు చేస్తే ఆర్థికాభివృద్ధి జరుగుతుందని వివరించారు. రాజ్యాంగ పీఠిక మీద ప్రమాణం చేసి మన కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేశారు. సమాజంలోని వారందరూ శ్రమలో పాలుపంచుకుని, సంపాదనను కూడా సమానంగా పంచుకోవాలన్న అంబేడ్కర్ మాటలను ఆయన ఉటంకిస్తూ, అప్పుడే సమసమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి అత్యవసరమైన అంశంపై సదస్సు నిర్వహించినందుకు నిర్వాహకులను, కళాశాల ప్రిన్సిపాల్ ను అభినందించారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బాల భాస్కర్ రాజ్యాంగం పట్ల, రాజ్యాంగంలోని కీలకమైన సాంకేతిక పదాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలనే సంకల్పంతో ఈ సదస్సు నిర్వహించామని చెప్పారు. రాజనీతి శాస్త్ర ఆచార్యులు డా.కె.భాస్కర్ సమన్వయకర్తగా వ్యవరించిన ఈ సదస్సులో నమ్రతా, రష్మిక వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
ఈ సదస్సులో పాల్గొన్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అధ్యాపకులకు ఆచార్య కోదండరాం ధ్రువపత్రాలను ప్రదానం చేశారు. ఈ సభలో కమిషన్ ఉపసంచాలకులు డా.షహజాద్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ సభలో డా.అయిజాజ్ సుల్తానా, డా.విప్లవ్ దత్ శుక్లా, డా.తిరుపతి, డా.శంకర్ డా.పావని, డా.కృష్ణవేణి, డా.శ్రీనివాస్ తదితర ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.