•  ఆర్థిక సంస్కరణల పితా మహుడు నరసింహారావు అని వ్యాఖ్య

వేద న్యూస్, హుస్నాబాద్:
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారత రత్న రావడం పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. పీవీకి భారత రత్న ప్రకటించిన నేపథ్యంలో మంత్రి పొన్నం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీవీ జాతి మరువ లేని నేత అని, దేశ ఆర్థిక వ్యవస్థ కు పీవీ ఆయువుపట్టుగా నిలిచాడు అని అన్నారు.

పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణ ల ఫలాలే ప్రస్తుతం దేశం అనుభవిస్తున్నదని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షులుగా పీవీ ఉన్నపుడు, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుని గా పీవీని చాలా సార్లు కలిసిన అనుభవం ఉందని మంత్రి పొన్నం గుర్తు చేసుకున్నారు.

పీవీ పుట్టిన గడ్డకు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని మంత్రి పొన్నం వెల్లడించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పీవీకి భారత రత్న వచ్చిన నేపథ్యంలో పీవీ నరసింహారావుతో ఉన్న అనుబంధాన్ని మంత్రి పొన్నం గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా వంగర గ్రామంలో సంబురాలు చేయాలని మంత్రి పొన్నం కార్యకర్తలకు పిలుపునిచ్చారు.