- పిల్లలు ఆంగ్లంలో పట్టు సాధించేలా బోధన
- విద్యార్థులకు విద్యను అందించడంలో ప్రత్యేక శ్రద్ధ
- బ్రిటిష్ కౌన్సిల్ పబ్లికేషన్స్‌లో జెడ్పీహెచ్ ఎస్ఏ ఇంగ్లిష్ టీచర్ ప్రాజెక్ట్ ఆర్టికల్
- యాక్షన్ రీసెర్చ్ మెంటారింగ్ స్కీమ్(ఏఆర్ఎంఎస్)లో భాగంగా ప్రజెంటేషన్
- బ్రిటిష్ కౌన్సిల్ చెన్నయ్ ఆఫీసుకు వెళ్లి టీచర్ రామంచ భిక్షపతి ప్రజెంటేషన్
వేద న్యూస్, వరంగల్:
ఉదయాన్నే విధులకు హాజరై.. సాయంత్రం కాగానే విధులు ముగించుకుని ఇంటికెళ్లే మనస్తత్వం కాదు ఆయనది.. విద్యతోనే సమాజంలో, విద్యార్థుల జీవితాల్లో మార్పు బలంగా వస్తుందని నమ్మే ఆయన.. విద్యా బోధన పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తారు. మంచి మనసున్న మాస్టారుగా పేరు గాంచిన ఆయన.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పిల్లలకు ఇంగ్లిష్ బోధించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టును బ్రిటిష్ కౌన్సిల్ పబ్లికేషన్స్‌లో ఆర్టికల్‌గా ప్రచురించడం విశేషం. ప్రాజెక్టు ప్రజెంటేషన్‌ను సదరు టీచర్ బ్రిటిష్ కౌన్సిల్ చెన్నయ్ ఆఫీసులో ఇవ్వగా, సభికులు హర్షం వ్యక్తం చేశారు. 8,9 వ తరగతుల విద్యార్థులకు బైలింగ్యువల్ అప్రోచ్ ద్వారా ఇంగ్లిష్‌ను బలంగా నేర్చుకునే విషయమై ఆయన రీసెర్చ్ పేపర్‌ను ప్రజెంట్ చేశారు. ఇంతకీ ఆయనెవరంటే..జెడ్పీహెచ్ ముల్కనూరు బాయ్స్ స్కూల్ ఎస్ఏ ఇంగ్లిష్ టీచర్ రామంచ భిక్షపతి.
బ్రిటిష్ కౌన్సిల్ యాక్షన్ రీసెర్చ్ మెంటారింగ్ స్కీం (ఏఆర్‌ఎంఎస్ ) ప్రాజెక్ట్ ఎన్ఐటీ వరంగల్, ఐఐటీ డీఎం కాంచీపురం, గౌహతి, యూనివర్సిటీస్ సహకారంతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు వారి తరగతి గదులలో ఇంగ్లీష్ బోధనలో వచ్చే సమస్యలను ఏ విధంగా పరి ష్కరించాలో పరిశోధన పరిష్కారాలను కనుగొని బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చెన్నయ్‌లో వారి పరిశోధనలు ప్రజెంట్ చేశారు.

11 ఆగస్టు 2025న వివిధ రాష్ట్రాల నుంచి 70 మంది ఉపాధ్యాయులు వారి పరిశోధనలను ప్రజెంట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం హనుమకొండ జిల్లా నుంచి రామంచ భిక్షపతి తన రీసెర్చ్ పేపర్‌ను ప్రజెంట్ చేశారు. 8వ, 9 వ తరగతి విద్యార్థులకు ఆంగ్లంలో బోధన విషయంలో తను అనుసరించిన పద్ధతిని రీసెర్చ్ పేపర్‌గా బ్రిటిష్ కౌన్సిల్ వారికి సమర్పించారు.

