• రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాల సమర్పణ
  • హాజరైన తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర అధ్యక్షులు రజిని కుమార్
  • తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు
  • ప్రతీ రోజు ప్రజల పక్షాన పోరాడే బీసీ బిడ్డ రవిని గెలిపించాలని ప్రజలకు అభ్యర్థన

వేద న్యూస్, భూపాలపల్లి:

భూపాలపల్లి నియోజకవర్గంలో తీన్మార్ మల్లన్న టీం తరఫున ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రవి పటేల్ గురువారం నామినేషన్ వేశారు. తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షులు రజిని కుమార్ ఆధ్వర్యంలో టీం సభ్యులతో భారీ ర్యాలీగా వెళ్లి ఆర్ఓ(రిటర్నింగ్ అధికారి)కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం రజిని కుమార్ మీడియాతో మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న టీం ఎజెండా అంశాలను తెలిపారు.

విద్య, వైద్యం, సత్వర న్యాయం, అవినీతి లేని రాజకీయ పరిపాలన లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పారు. బహుజన నాయకుడు అయిన రవి పటేల్ ను భూపాలపల్లి ప్రజలు నాయకుడిగా ఎన్నుకోవాలని కోరారు. యువకుడు రవి పటేల్ ప్రజల సమస్యల మీద ఎల్లవేళలా రాష్ట్ర ప్రభుత్వం పై పోరాడుతున్నాడని తెలిపారు.

రవిపటేల్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని వెల్లడించారు. ప్రతీ రోజు ప్రజల పక్షాన నిలబడుతున్న రవి పటేల్.. ఒక బీసీ బిడ్డగా జనం ముందుకు వస్తున్నాడని చెప్పారు. రవిపటేల్ ను ఆదరించి..ఆశీర్వదించాలని తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా, మండల, గ్రామ కమిటీ టీం సభ్యులు పాల్గొన్నారు.