వేద న్యూస్, నల్లబెల్లి:

 

తె లంగాణలో సుగాలి, బంజారా, లంబాడీ, యానాది, ఎరుకల వర్గాలకు ఎస్టీ హోదా పూర్తిగా రాజ్యాంగబద్ధమని రిటైర్డ్ ఎంఈఓ యం. దేవా (జాదవ్) స్పష్టం చేశారు. సోయం బాబురావు వ్యాఖ్యల నేపథ్యంలో కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ, వాస్తవానికి వీరు చట్టబద్ధంగానే ఎస్టీ జాబితాలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ..

1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో సుగాలి, బంజారా, లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చినా, అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో వీరిని చేర్చలేదని తెలిపారు. ఈ అన్యాయంపై 1956 నుండి 1976 వరకు నిరంతర పోరాటం సాగించగా, తెలంగాణ ప్రాంత ప్రజాస్వామ్య ఒత్తిడి ఫలితంగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని వివరించారు. దాని ఆధారంగా కేంద్రం 76వ రాజ్యాంగ సవరణచేసి తెలంగాణ సుగాలి, బంజారా, లంబాడీ, యానాది, ఎరుకల వారిని ఎస్టీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు 4 శాతం నుండి 6 శాతానికి పెంచిందని పేర్కొన్నారు.

రాజ్యాంగబద్ధంగా చేర్చిన వర్గాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడం అసాధ్యమని, రిజర్వేషన్లు సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో అభివృద్ధి కోసం కల్పించబడినవని ఆయన అన్నారు.

కొందరి అనుచిత చర్యల వలన వర్గ పోరు రావచ్చని హెచ్చరించిన ఆయన, రిజర్వేషన్ల రక్షణ కోసం అన్ని వర్గాలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.“జై బంజారా, జై సేవాలాల్” అని ఆయన నినదించారు.