• హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేక , డెలివరీ చేయలేమని చేతులెత్తేసిన వైనం  
  • సకాలంలో స్పందించిన  ప్రముఖ సామాజికవేత్త

వేద న్యూస్, కరీంనగర్:

హుజురాబాద్ పట్టణం లోని 13వ వార్డుకు చెందిన దుబాసి వెన్నెల పురిటినొప్పులతో అపస్మారక స్థితిలో డెలివరీ కోసం హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. క్రిటికల్ కేర్ సదుపాయాలు లేవని, తల్లి, బిడ్డ ఆరోగ్యానికి గ్యారంటీ ఇవ్వలేమని సిబ్బంది చెప్తే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హన్మకొండ  మిషన్ హాస్పిటల్ కి అంబులెన్సులో తరలించారు.అక్కడ వారికి ఎవరు తెలియకపోవడంతో స్థానిక నాయకురాలు వేముల పుష్పలత సర్జరీ కోసం రక్తం అవసరం పడడంతో సబ్బని వెంకట్ ను ఆదివారం సంప్రదించారు. ఆయన రక్త సహాయంతో పాటు , వెంటనే మిషన్ హాస్పిటల్ సూపెరింటెండెంట్, సిబ్బందితో మాట్లాడి సర్జరీ కి కావాల్సిన ఏర్పాట్లు చేశారు.

సర్జరీ సజావుగా జరిగి వెన్నెల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కాగా, హుజురాబాద్ నియోజకవర్గ  కేంద్రంలో ఒక డెలివరీ చేయడానికి కూడా సదుపాయాలు కల్పించలేని నాయకత్వం , రాజకీయం మీద సబ్బని వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

స్వార్ధ రాజకీయాలు మానుకోండి .. ప్రజాశ్రేయస్సు, పేద వారి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి – సబ్బని వెంకట్ 

ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మంచి చేయడానికి అనే భావన రాను రాను కనుమరుగవుతున్నది . వ్యక్తిగత కక్షలు, స్వలాభం కోసమే అయితే రాజకీయాలు మానుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఈ సృష్ఠిలోఒక స్త్రీ బిడ్డకు జన్మనివ్వడం అనేది మానవ మనుగడకు అవసరం, అలాంటి సమయంలో వాళ్ళు పడే అవస్థ సమయంలో కనీస సౌకర్యాలు కల్పించడం మనందరి బాధ్యత.

స్థానిక రాజకీయనాయకులు కూడా ఎదో ఒక రోజు వచ్చి ఫొటో లకు ఫోజులు ఇచ్చి సోషల్ మీడియా రీల్స్ చేసుకుని ..పథకాలు రాలేదని, లేదా ఇంకేదో రాలేదని ప్రభుత్వాలను విమర్శించేబదులు , మొదట సదుపాయాలు కల్పించమని మాట్లాడితేనో , లేక పోరాడితేనో రాజకీయంగా కంటే కూడా నాయకులుగా ప్రజల గుండెల్లో నిలుస్తారని హితవు పలికారు. 

ఈ సమస్య నా దాకా వచ్చింది కాబట్టి , నేను అందుబాటులో ఉన్నాను కాబట్టి సకాలంలో స్పందించి డాక్టర్స్ మాట్లాడి , అవసరమైన రక్తం ఆరెంజ్ చేసాము కాబట్టి తల్లి, బిడ్డ క్షేమంగా భయపడ్డారు , లేకపోతే వారి పరిస్థితి , వారి కుటుంభసభ్యుల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తేనే బాధగా ఉంది, ఇప్పటికైనా స్థానిక నాయకులు ఆ పార్టీ , ఈ పార్టీ అని కాకుండా పేద ప్రజల ఆరోగ్యం మీద ద్రుష్టి పెడితే బాగుంటుంది. 

100 పడకల ఆసుపత్రి ఉంది అని గొప్పలు పోవడం కాదు. దానిలో ఓ 10 మంది డాక్టర్లను నియమించండి. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్న ఇప్పటికి నియోజకవర్గంలోని ఏ ఆసుపత్రిలో కూడా ఒక గుండె వైద్య నిపుణుడు లేడు. ఈ కారణంతో గత కొన్ని నెలలుగా చాలా మంది మృత్యువాత పడ్డా ఎవరికీ చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం బాధాకరం. హుజురాబాద్ కు సంబంధించిన శాసన సభ్యులు అసెంబ్లీలో సమస్యల మీద మాట్లాడితే, ఇతర నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే సమస్యలు పరిష్కారం అవుతాయి.