- తిరోగమన రాజకీయాలతో భవిష్యత్తుపై నీలి నీడలు?
- యువత ఆశలకు రెక్కలు వచ్చేది ఎన్నడు?
- ప్రజల ఆకాంక్షల పై నీళ్లు చల్లే హక్కు పాలకులకు ఎక్కడిది?
- ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్
వేద న్యూస్, జమ్మికుంట:
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేయవలసిన నాయకులు కాలాన్ని అనవసరంగా వృథా చేస్తున్నారని, దీనివల్ల అభివృద్ధి అనే మాటకు విలువ లేకుండా పోతున్నదని, భవిష్యత్తుపై కలలు కంటున్న యువత ఆశలపై నాయకులు నీళ్లు చల్లుతున్నారని, తద్వారా ఓటు అనే ఆయుధం ద్వారా తమను గెలిపించిన ప్రజలను, యువతను మోసం చేస్తున్నట్లుగా అనేకమంది విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల మధ్యలో గల హుజురాబాద్ పాత తాలూకా అన్ని రంగాలలో ఇప్పటికే అభివృద్ధి చెందవలసి ఉండగా, అందుకు విరుద్ధంగా ఈ ప్రాంతంలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండడం దారుణమైన విషయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్యకాలంలో హుజురాబాద్ స్థితిగతులపై ప్రత్యక్షంగా… పరోక్షంగా దృష్టి సారించిన ప్రముఖ సామాజికవేత్త… ఆపన్న హస్తం అందించేవాడిగా గణతికెక్కిన సబ్బని వెంకట్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయంగా హుజురాబాద్ ప్రాంతం నుండి ఎంతోమందికి అవకాశాలు లభించినప్పటికీ గత మూడు నాలుగు దశాబ్దాల నుండి హుజురాబాద్ ప్రాంతం సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాలను దాటిపోవడం లేదని, అభివృద్ధి అనేది కొంతమంది నాయకులకే పరిమితం కాలేదు అన్న నగ్న సత్యం హుజురాబాద్ ప్రాంత ప్రజలకు యువతకు తెలిసినప్పటికీ వారు ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో విన్నకుండిపోతున్నారని సబ్బని వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లు వేయడం, మురికి కాలువలు నిర్మించడం, రేషన్ బియ్యం అందించడం, పింఛన్లు పంపిణీ చేయడం వరకే నాయకులు పరిమితం అవుతున్నారని తెలిపారు. నాయకులు లేకుండా ప్రభుత్వ అధికారులు ఈ పనులన్నింటినీ చక్కబెడతారన్న విషయం నాయకులు గుర్తిస్తే మంచిదని సబ్బని అభిప్రాయపడ్డారు.
హుజరాబాద్ నియోజకవర్గంలో వైద్య పరంగా అవసరమైనన్ని సౌకర్యాలు లేవని, విద్యాపరంగా ఉన్నతమైన కళాశాలలు కూడా లేకపోవడం వల్ల విద్యార్థిని విద్యార్థులు ఇతర జిల్లాలకు తరలిపోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నదని వివరించారు. ఈ ప్రాంతంలో ఏ ఒక్క వృత్తి విద్య కోర్సులను ప్రవేశ పెట్టకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కనీసం కుటీర పరిశ్రమలనైన స్థాపించినట్లయితే ఈ ప్రాంతానికి చెందిన వందలాదిమంది యువతకు ఉపాధి దొరుకుతుందన్న నగ్న సత్యాన్ని ఈ ప్రాంత పాలకులు గుర్తించకపోవడం మరి దారుణమని సబ్బని వెంకట్ అభిప్రాయపడ్డారు. ప్రజల ఓట్ల ద్వారా పదవులు చేపడుతున్న నాయకులు ఐదేళ్ల సమయాన్ని వృథా చేస్తున్నారని, అక్కరకు రాని విషయాలను తెరమీదకు తెచ్చి కలుషితమైన రాజకీయాలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని పాలకులు విస్మరించకూడదని ఆయన హితవు పలికారు.
ఉదాహరణకు హుజురాబాద్ తో సంబంధంలేని బూడిద రాజకీయాన్ని రగిలించడం ద్వారా గత కొన్ని వారాలుగా ఈ ప్రాంతంలో వాతావరణాన్ని కూడా కలుషితం చేసిన పేరు ఈ ప్రాంత నాయకులకే దక్కుతుందని ఆయన విమర్శించారు. ఇలాంటి అక్కరకురాని విషయాలను తరచుగా తెరమీదకు తెచ్చి సమయాన్ని వృథా చేస్తున్నారని, మనకన్నా ఎంతో వెనుకబడి ఉన్న ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుండగా హుజురాబాద్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా తయారవడం నిజంగా ఈ ప్రాంత ప్రజలు యువత చేసుకున్న పాపమేమో అని సబ్బని వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. తన దృష్టిలో ఇలాంటి తప్పిదాలు ఏ ఒక్కరో, ఏ ఒక్క రాజకీయ పార్టీయో చేస్తున్నట్లుగా తాను విమర్శలు చేయడం లేదని, ఇందుకు ప్రతి ఒక్కరూ బాధ్యులేనని ఆయన అన్నారు. వాస్తవానికి ప్రతి మండల కేంద్రంలో విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని
వసతులను కల్పించవలసిన బాధ్యత పాలకులపై ఉందన్న విషయం ఇకనైనా గమనిస్తే మంచిదని ఆయన హితవు చెప్పారు.
హుజురాబాద్ నియోజకవర్గం కేంద్రానికి కూతవేటు దూరంలో రైల్వే కనెక్టివిటీ గల జమ్మికుంట, ఇల్లంతకుంట ప్రాంతాలు ఉన్నాయని, అవసరమైనంత మేరకు ల్యాండ్ బ్యాంకు కూడా సమృద్ధిగా లభించే అవకాశం ఈ ప్రాంతంలో ఉందన్న విషయాన్ని పాలకులకు తెలుసని.. ఇప్పటికైనా ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపి మెడికల్ కళాశాలను.. కొద్ది పరిశ్రమలను ఈ ప్రాంతంలో నెలకొల్పే విధంగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
ఒకవేళ వరంగల్ కరీంనగర్ జిల్లాల మధ్యలో గల హుజురాబాద్ నే అభివృద్ధి చేయదలచుకుంటే ఆ దిశగానైనా పాలకులు ముందడుగు వేయవలసిన అవసరం ఉందన్నారు. ఉన్నత విద్యా సంస్థలు… పరిశ్రమలు నెలకొల్పినట్లైతే పరోక్షంగా, ప్రత్యక్షంగా అనేకమందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుందని, తద్వారా ఈ ప్రాంతం రెవెన్యూ పరంగా కూడా మరింతగా పుంజుకుంటుందని సబ్బని అభిప్రాయపడ్డారు.
నాయకులకు దూరదృష్టి ఉండాలి తప్ప తాత్కాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని పని చేయవద్దని, జీవితాంతం గుర్తిండిపోయేలా అభివృద్ధి పనులు చేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోవాలని… ఆ దిశగా హుజురాబాద్ ప్రాంత నాయకులు ఆలోచనలు చేయాలని సబ్బని వెంకట్ విజ్ఞప్తి చేశారు.
కళలు, క్రీడలు, మేధావులు, రాజకీయ దురంధరులు, సాహిత్య ప్రియులకు పుట్టినిల్లుగా పేరుగాంచిన హుజురాబాద్ పాత తాలూకా అభివృద్ధిలో మాత్రం అందనంత దూరంలో ఉండడం ప్రతి హృదయాన్ని కలచివేస్తుండడం ఎంతైనా బాధాకరమని ఆయన తన మనోవేదనను వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో విస్తారమైన వనరులు ఉన్నప్పటికీ నాయకులు వాటిని ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని, ఎలాంటి వనరులు లేని ప్రాంతాలు అభివృద్ధి పరంగా కళ్ల ముందు శరవేగంగా దూసుకుపోతున్న వైనాన్ని హుజురాబాద్ పాత తాలూకా నేతలు గమనిస్తే మంచిదని సబ్బని వెంకట్ అభిప్రాయపడ్డారు.
[…] అభివృద్ధిని విస్మరిస్తున్న నేతలు? […]