• రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్, ముగ్గురిపై కేసు నమోదు
  • దాచారంలో ఇల్లంతకుంట పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్త దాడులు

వేద న్యూస్ , ఇల్లంతకుంట:

 

ఇసుక తరలింపులో అక్రమాలకు పాల్పడిన రెండు ట్రాక్టర్లను ఇల్లంతకుంట పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా సీజ్ చేశారు. ఈ ఘటనలో ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులతో సహా మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.

గురువారం (23.10.2025) సాయంత్రం 4 గంటల సమయంలో దాచారం గ్రామం వద్ద పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీ నిర్వహించింది.ఈ తనిఖీల్లో ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో భాగంగా ట్రాక్టర్ల యజమానులు తాసిల్దార్ ద్వారా ఇల్లంతకుంట మండలం ఆరేపల్లి గ్రామానికి ఇసుక తరలించడానికి అనుమతి కూపన్లను (పర్మిషన్) పొందినట్లు వెల్లడైంది.

అయితే, వారు ఆరేపల్లికి తరలించకుండా, అనుమతి పొందిన గ్రామానికి కాకుండా దాచారం గ్రామానికి ఇసుకను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమతిని దుర్వినియోగం చేస్తూ.. అక్రమంగా ఇసుక తరలింపునకు పాల్పడిన రెండు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.

అలాగే, ఈ అక్రమ రవాణాకు బాధ్యులైన ముగ్గురిపై కేసు నమోదు చేశారు. రహీంఖాన్ పేట గ్రామానికి చెందిన బిల్లవేణి శేఖర్, రహీంఖాన్ పేట గ్రామానికి చెందిన రుద్ర రాజశేఖర్,తిప్పాపూర్ గ్రామానికి చెందిన బెజ్జంకి శ్రీహరి ఉన్నారు.

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై సిరిసిల్ల అశోక్ ఈ సందర్భంగా హెచ్చరించారు.