- నవచేతన వారి ఆధ్వర్యంలో..
వేద న్యూస్, వరంగల్:
ప్రస్తుత సాంకేతిక సమాజంలో ‘చదివే’ సంస్కృతి నుంచి వేరై పోతూ ‘చూసే’ సంస్కృతికి మాత్రమే దగ్గరవుతున్నారు. బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్‌కు మాత్రమే ప్రతి ఒక్కరూ దాదాపుగా అలవాటుపడుతున్న సందర్భమిది.. ఈ తరుణంలో వ్యక్తిత్వాన్ని పెంపొందించి.. విలువలను అలవరిచే ‘‘పుస్తకం’’ ను పాఠకుడి దరి చేర్చేందుకు నవచేతన వారు ‘సంచార పుస్తకాలయం’ ద్వారా బుక్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
గత మూడు రోజులుగా హూజూరాబాద్ నియోజకవర్గకేంద్రంలో సంచారపుస్తకాలయాన్ని అందుబాటులో ఉంచారు. నేడు(సోమవారం) జమ్మికుంట పట్టణంలో నవచేతన వారి సంచార పుస్తకాలయంను చదువరులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. సంచార పుస్తకాలయంలో(వెహికల్)లో రకరకాల బుక్స్ అవేలబుల్‌గా ఉన్నాయని, వ్యక్తిత్వ వికాసం, సిద్ధాంతాలు, బాల కథలు, సాహిత్యం, ప్రముఖ కవులు, రాజకీయ నేతలు, కథకులకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయని వెల్లడించారు. చదువరులు, విద్యార్థులు, బుద్ధి జీవులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేయాలని కోరారు.