•  దయచేసి బిల్లులు చెల్లించండి
  •  ప్రభుత్వానికి మాజీ సర్పంచుల విజ్ఞప్తి 
  •  తమను కష్టాలకొలిమి నుంచి బయటపడేయాలని వేడుకోలు
  •  పల్లె ప్రథమపౌరులుగా పనిచేసిన వారంటే పట్టింపే లేదా?
  • ఆత్మహత్యే శరణ్యమని మాజీ సర్పంచ్ నిరసన

వేద న్యూస్, పరకాల :

‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’.. గ్రామస్వరాజ్యం.. గ్రామాల్లో అభివృద్ధి జరిగితే ఆటోమేటిక్‌గా దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందనే.. మాటలు మనకు ఎప్పుడూ వినబడుతుంటాయి. కానీ, ఆచరణలో మాత్రం ఆ పల్లెలను డెవలప్‌మెంట్ దిశగా నడిపించిన ప్రథమ పౌరులకు గడ్డు పరిస్థితులు నెలకొంటున్నాయి. తెలంగాణలో సర్పంచులుగా పని చేసి బిల్లుల కోసం మాజీ ప్రజాప్రతినిధులు ఎదురుచూపులతోనే కాలం వెల్లదీస్తున్నారు. చేసిన పనుల వల్ల అప్పులపాలై.. ఇబ్బందులు పడుతున్నామని, తమను ప్రస్తుత సర్కారు ఆదుకోవాలని నెలలుగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. దయచేసి తమకు బిల్లులు ఇప్పించాలని వేడుకుంటున్నారు. గ్రామాన్ని అభివృద్ధిపరంగా ముందుకు తీసుకెళ్లేందుకు తాము కృషి చేశామని, తమను గుర్తించి.. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఆత్మహత్యే శరణ్యమని నిరసనలు.. పాలకులు పట్టించుకోరా?

 

2018 నుంచి 2024 వరకు గ్రామ అభివృద్ధిలో భాగంగా చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని నడికూడ గ్రామ మాజీ ఊర రవీందర్‌రావు పేర్కొన్నారు. బిల్లులు రానందున నడికూడ గ్రామపంచాయతీ ఆఫీసుకు, హైస్కూల్‌లోని డైనింగ్ హాల్‌లకు తాళం వేసి, తాగునీటి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య శరణ్యమంటూ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రవీందర్ రావు మాట్లాడుతూ..పెండింగ్‌లో ఉన్న బిల్లులు గ్రామపంచాయతీ భవన నిర్మాణ వ్యయం రూ.20 లక్షలు, మన ఊరు మనబడిలో జెడ్పీహెచ్ఎస్ డైనింగ్ హాల్ నిర్మాణం రూ.6 లక్షలు, జీపీ నుండి (ఫండ్) ప్రధానోపాధ్యాయులు ఆఫీస్ నిర్మాణ వ్యయం రూ.2.50 లక్షలు, మన ఊరు మనబడిలో భాగంగా ఎంపీపీఎస్ నడికూడ క్లాస్ రూముల నిర్మాణ వ్యయం రూ.14 లక్షలు, ఆర్‌డబ్ల్యూఎస్ సప్లయ్ కోసం సీడీపీ నిధుల నుంచి పైప్ లైన్ కోసం రూ.5 లక్షలు జీపీ డెవలప్‌మెంట్‌లో భాగంగా గ్రావెల్, లైటింగ్ వ్యయం రూ.8 లక్షలు.. మొత్తం రూ.55.50 లక్షలు అప్పులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేసినట్టు రవీందర్‌రావు వెల్లడించారు.

ప్రజాసేవలో ఉంటూ, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లుటకు అహర్నిశలు కష్టపడ్డానని చెప్పారు. గ్రామాభివృద్ధి చేయడమే తప్పా? అని ప్రశ్నిస్తున్నారు. కష్టాల్లో ఉన్న సర్పంచులను ఆదుకోనలేరా ప్రభుత్వమా? అని అడిగారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల నుంచి తమ పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న తరుణంలో.. తాము అప్పులు చేసి తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక తమ.. కుటుంబం రోడ్డు మీద పడ్డ సందర్భంగా తాము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నామని వెల్లడించారు. తమను ఆదుకోవాలని కోరారు.