- పాఠశాల యాజమాన్యం ఉదారత
- పాముకాటుతో మృతి చెందిన బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం
వేద న్యూస్, చొప్పదండి:
తమ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ, తన ఇంటిలో పాముకాటుకు గురై మరణించిన ఓ నిరుపేద బాలిక కుటుంబానికి, ఆర్థిక సాయం అందించి పాఠశాల యాజమాన్యం తన ఉదారతను చాటుకుంది.
మండలంలోని వెదురుగట్ట గ్రామానికి చెందిన గర్వంద రవీందర్ చిన్న కుమార్తె గర్వాంద దీప్తిక (12) పట్టణంలోని శ్రీ కృష్ణవేణి హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నది. ఈనెల 5 న శుక్రవారం తన ఇంటిలోని కిరాణా షాపులో పాము కాటుకు గురై బాలిక మరణించింది. పాఠశాల యాజమాన్యం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన పాఠశాల కరస్పాండెంట్, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మరణించిన బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఆదివారం ఉదయం వెదురుగట్ట గ్రామంలోని ఆమె ఇంటికి వెళ్లి, బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బాలిక చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రూ.5 వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదరికంలో ఉన్నా నానా అగచాట్లు పడుతూ తన కుమార్తెలను ఆ కుటుంబ పెద్ద చదివిస్తుండగా, దురదృష్టవశాత్తు పాముకాటుతో దీపిక మరణించడం బాధాకరమన్నారు.
కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణవేణి హై స్కూల్ ప్రిన్సిపాల్ సాంబరాజు, ఇంచార్జ్ మేడిశంభయ్యా, ఉపాధ్యాయ బృందం, మారం శ్రీనివాస్ పాల్గొన్నారు.