వేద న్యూస్, రుద్రూర్:
తన భర్త మృతిపై అనుమానాలున్నాయని మృతుడి రెండో భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
వివరాల్లోకెళితే..రుద్రూర్ మండల కేంద్రంలోని ఆర్ఎన్సీ కాలనీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మేతరి సాయిలు.. రెండు నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతూ పది రోజుల క్రితం మృతి చెందారు.
ఎస్సై సాయన్న కథనం ప్రకారం..మృతుడు మేతరి సాయిలు మొదటి భార్య శోభ మరణించగా, కోటగిరి గ్రామానికి చెందిన బొర్ర సాయవ్వతో సాయిలుకు వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు కలదు. అయితే, ఇటీవల తన భర్త సాయిలు మృతి చెందగా తనకు సమాచారం ఇవ్వలేదని సాయవ్వ తెలిపారు. అంత్యక్రియలు చేసిన విషయం తనకు తెలియదని, సాయిలు మృతిపై గైని పెద్ద సాయిలు, గైని శివలీల, గైని పోచమ్మల పై అనుమానం ఉందని, బొర్ర సాయవ్వ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని ఎస్సై పేర్కొన్నారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మంగళవారం మృతుడు సాయిలు మృత దేహాన్ని పూడిక తీయించి తహశీల్దార్ తారాబాయి, డాక్టర్ల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి, నిజామాబాద్ ఫోరెన్సిక్ వారికి పంపామని ఎస్సై సాయన్న వెల్లడించారు.