– 2014, 2018లోనూ ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించిన కేసీఆర్
– ఈ నెల 15న లక్ష మందితో హుస్నాబాద్ గడ్డమీద ‘ప్రజా ఆశీర్వాద సభ’
– కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవడం..సతీశ్ కుమార్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవడం ఖాయం
– బీఆర్ఎస్ పార్టీది సుస్థిర సర్కార్: వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
– గులాబీ పార్టీ కార్యకర్తలు సైనికుల వలే పని చేయాలి: బోయిన్‌పల్లి వినోద్ కుమార్ పిలుపు
వేద న్యూస్, హుస్నాబాద్:
హుస్నాబాద్ గడ్డ సీఎం కేసీఆర్ ఎన్నికల సమర శంఖారావం పూరించడానికి మరొకసారి వేదిక కాబోతుంది. 2014, 2018లోనూ ఇక్కడి నుంచే కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రచారం ప్రారంభించారు. తన లక్ష్మీ నియోజకవర్గంగా చెప్పుకునే హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికల సన్నాహక సభ నిర్వహించి కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఈ నెల 15న ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హుస్నాబాద్ విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన లక్ష మందితో నిర్వహించే ‘ప్రజా ఆశీర్వాద సభ’తో హుస్నాబాద్ గడ్డ నుండి ఎన్నికల ప్రచారం షురూ కానుంది.
మంగళవారం మంత్రి హరీశ్ రావు, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్‌తో కలిసి స్థల పరిశీలన చేశారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ సైనికులవలే పనిచేసి ప్రజాఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు.

మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సుస్థిరమైన ప్రభుత్వమని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ పథకాలను అమలుచేసి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలతో నేడు దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్నామని చెప్పారు. దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని, దేశంలోనే వరి ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానంలో ఉందని వివరించారు. కాళేశ్వరం నీటితో తెలంగాణ సస్యశ్యామలమైందని అన్నారు ఇదే స్ఫూర్తితో హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తామని చెప్పారు.
ప్రజలందరి ఆశీర్వాదం సీఎం కేసీఆర్ పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలది కల్లబొల్లి కబుర్లు తప్ప వారు ప్రజలకు చేసింది ఏమీలేదని ప్రజలందరూ అన్ని గమనించాలని కోరారు. కాంగ్రెస్ అంటే మాటలు, మూటలు, మూఠాల పార్టీ అని దుయ్యబట్టారు. హుస్నాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతం కల్లోలిత ప్రాంతమని, నేడు అభివృద్ధికి చిరునామాగా మారిందని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే సతీష్ కుమార్ రూ.వేల కోట్లతో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని, హుస్నాబాద్ నియోజకవర్గ చిరకాల వాంఛ గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశారని, ప్రజలందరూ మరొకసారి సతీశ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ నెల 15న సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫాం లు అందించి బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి..మొట్టమొదటి ఎన్నికల సభ హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారని, హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభ నుండి సీఎం కేసీఆర్ ప్రజలకు తీపి కబురు చెబుతారని హరీష్ రావు స్పష్టం చేశారు.
హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం నుండి మరొకసారి సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. లక్ష మందితో అక్టోబర్ 15న ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. హుస్నాబాద్ నియోజకవర్గం లోని ప్రతీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైనికులవలె పనిచేసి సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, హుస్నాబాద్ మున్సిపల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.