వేద న్యూస్, డెస్క్ :
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 తేదీ సరికొత్త యుగానికి ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇకపై రాముడు టెంట్లో ఉండాల్సిన అవసరం లేదని, మందిరంలో ఉంటారని పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠతో రామ భక్తులంతా చాలా ఆనందంతో ఉన్నారని మోదీ తెలిపారు. అయోధ్యలో ఆలయ నిర్మాణం ఆలస్యమైనందుకు రాముడికి క్షమాపణలు చెబుతున్నానని మోదీ అన్నారు. అయోధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రామాలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం వైభవంగా సాగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ఠ ప్రధాన పూజ మధ్యాహ్నం 12.29 గంటలకు మొదలైంది. అభిజిత్ లగ్నంలో ఈ క్రతువు ముగిసింది.
ఈ కార్యక్రమంలో ప్రధాన పూజలు గర్భగుడిలో జరిగాయి. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన వెంటనే భారత వైమానిక దళం(ఐఏఎఫ్) హెలికాప్టర్లు ఆలయంపై పూల వర్షం కురిపించాయి.
ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రాముడి విగ్రహానికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాగా రాముని విగ్రహానికి అభిషేకం కోసం 114 కుండలలో వివిధ తీర్థ స్థలాల నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ మనదేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే మూలం. రాముడి ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యం. ఈ క్షణం దేశప్రజల సహనం, పరిపక్వతకు నిదర్శనం. ఈ క్షణం మన విజయానికే కాదు, వినయానికి కూడా సూచిక.
పవిత్రత, శాంతి, సామరస్యం భారత ఆత్మకు ప్రతిరూపం. వసుధైక కుటుంబం అనేది మన జీవన విధానం. ఇది సాధారణ మందిరం కాదు- దేశ చైతన్యానికి ప్రతీక. రాముడు మనదేశ ఆత్మ, ధైర్యసాహసాలకు ఆయన ప్రతిరూపమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీపాటు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు ప్రముఖులు ,రామ భక్తులు పాల్గొన్నారు.