కంచ గచ్చిబౌలి భూముల వేలంను ఆపాలంటూ ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు.. ధర్నాలకు సినీ రాజకీయ పలు రంగాలకు చెందిన ప్రముఖులు బాసటగా నిలుస్తున్నారు. ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ యూనివర్సిటీ భూముల వేలాన్ని తక్షణమే ఆపేయాలంటూ హెచ్ సీయూ విద్యార్థుల పోరాటాలకు మద్ధతుగా తమ స్వరాన్ని విన్పిస్తున్నారు.
తాజాగా ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ” ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రకృతి విధ్వంసాన్ని ఆపండంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకున్నారు. ఈ వివాదం గురించి రెండు రోజుల ముందే నాకు తెల్సింది. అయితే దీని పూర్వపరాలు పూర్తిగా తెల్సిన తర్వాతనే మాట్లాడుదామని రెండు రోజులు ఆగాను. ఈ రెండు రోజుల్లో దాని గురించి పూర్తిగా ఆధ్యాయనం చేశాను.
రేవంత్ రెడ్డి గారూ ఓ తల్లిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రకృతిని మనం కాపాడుకుంటే. ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు నాకు నలబై నాలుగేండ్లు. నేను ఇవాళో .. రేపో చనిపోతాను. కానీ నా పిల్లలు.. మనందరి పిల్లలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. వారికి ఆక్సిజన్ కావాలి. వారికి వాటర్ కావాలి. వారికి భవిష్యత్తు కావాలి. అభివృద్ధి గురించి అందరితో చర్చించుకుని ముందుకెళ్దాం. ప్రస్తుతం అక్కడున్న అడవిని వదిలేసి వేరే చోట అభివృద్ధి చేయండి. హెచ్ సీయూను కాపాడంటూ ఆమె కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నపం చేశారు.