•  ప్రైవేటు డీలర్లకు అలాట్ అయిన యూరియా బ్లాక్ కు వెళ్తుందా..?
  • నిగ్గు తేల్చాలని రైతుల డిమాండ్

వేద న్యూస్, నల్లబెల్లి:

రైతులకు మళ్లీ కష్టాలు ఆదిలోనే మొదలయ్యాయి. పంటను కంటికి రెప్పలా కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, పంటకు బూస్టర్ గా పనిచేసే యూరియా దొరకక, యూరియాను పట్టుకోవడం గగనమవు తున్నది. యూరియా వచ్చిందంటే చాలు.. యూరియా కోసం రైతులు క్యూ కట్టి రెండు మూడు రోజులు ఒక బస్తా కోసం వెంపర్లాడిన ఘటనలు జరిగాయి. ఇదే తంతు మళ్లీ వర్షం కాలం ప్రారంభం కాగానే మొదలవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఎసిఎస్ల ద్వారా, ఆగ్రోస్ ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్నప్పటికీ మరి వివిధ కంపెనీలకు చెందిన ప్రైవేటు ఫర్టిలైజర్ షాప్ డీలర్లకు అలాట్ అయిన యూరియా ఎక్కడికి వెళుతుంది ?అక్కడ ఎందుకు ప్రతి రైతుకు యూరియా అందివ్వడం లేదని రైతులు.. వ్యవసాయ శాఖ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడిప్పుడే రైతులు మొక్కజొన్న, పత్తిలాంటి పంటలు వేసి యూరియా కోసం ఎదురుచూస్తున్న తరుణం లోనే యూరియా కొరత ఉండడంతో.. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేస్తే ఇంకా యూరియా డిమాండ్ పెరుగనున్న నేపథ్యంలో మళ్లీ పాత రోజులు వచ్చాయని గత ఘటనను అన్నదాతలు గుర్తు చేస్తున్నారు.

డీలర్లకు అలాట్ అయిన యూరియా ఎక్కడికెళ్తుంది…?

వ్యవసాయ శాఖ అధికారులు పిఎసిఎస్ సొసైటీలకు, ఆగ్రోస్ సేవా కేంద్రాల ద్వారా యూరియాను పంపిణీ చేస్తున్నప్పటికీ.. ప్రైవేటు డీలర్లకు అలాటైన యూరియా ఎక్కడికెళ్తుంది, బ్లాక్ మార్కెట్ కు తరలుతోందా, అధిక రేటు పలుకుతుందా,? లేదా యూరియా బస్తాకు మరేమైన పురుగుమందులు గుట్టు చప్పుడు కాకుండా కలిపేసి దగ్గర దగ్గర రైతులకు డీలర్లు అమ్ముతున్నారా? అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులకు వచ్చిన యూరియా విషయంపై వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా అధికారులు సమగ్ర విచారణ చేసి.. ఎక్కడికెళ్తుంది యూరియా ? అనేది పసిగట్టి చర్యలు తీసుకోకపోతే యూరియాను పెద్ద మొత్తంలో బ్లాక్ చేసే దందా నడుస్తున్నదని, ఇది వ్యవసాయ శాఖ అధికారులు డీలర్లకు మద్దతు పలకడంతోటే ఇలా జరుగుతుందని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నానో యూరియా తీసుకోవాల్సిందే

వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ప్రభుత్వం పిఎసిఎస్ ద్వారా ఆగ్రోస్ ద్వారా యూరియాని పంపిణీ చేస్తూనే నానో యూరియా కొనాల్సిందేనని.. గట్టిగా బలవంతంగా రైతులను కొనేలా చేస్తున్నారు. నానో యూరియా పంటలకు వాడితే లాభాలు జరుగుతున్నప్పటికీ..రైతులకు అవగాహన లేకపోవడంతో అధికారులు పెట్టె ఇబ్బందుల వల్ల నానో యూరియా డబ్బాను కొనాల్సి వస్తుందని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

యూరియాకు బదులు నానో యూరియాను స్ప్రే చేయడం ద్వారా.. యూరియా బస్తా ఎంతయితే ఫలితం ఇస్తుందో.. నానో యూరియా సైతం పంటలకు బలం చేకూరుస్తున్నప్పటికీ రైతులకు సరైన రీతిలో అవగాహన లేకపోవడంతో వ్యవసాయ శాఖ రైతుల చేతిలో అభాసు పాలవుతు న్న దని పలువురు పేర్కొంటున్నారు.