•  ఉత్తమ వైద్యుడిగా గోల్డ్ మెడల్స్ అందుకున్న ప్రముఖ వైద్యుడు
  •  ఐఎంఏ హుజూరాబాద్ జమ్మికుంట శాఖ ప్రధాన కార్యదర్శిగానూ సేవలు
  •  విలువైన వైద్యాన్ని గ్రామీణ ప్రజలకు తక్కువ ఖర్చులో అందించేందుకు ప్రయత్నం
  •  సామాజిక బాధ్యతగా పలు ఆరోగ్య సంబంధిత విషయాలపై నిత్యం అవగాహన

వేద న్యూస్, జమ్మికుంట:

ప్రజలకు సేవ చేయాలనే ఆశయం, ఆలోచనకు బీజం చిన్న నాటనే ఆయన మనసులో పడింది. తన సొంతూరు నుంచి సుదూర ప్రాంతాలకు సరైన వైద్యం కోసం తండ్రి, గ్రామస్తులు వెళ్తుండటం గమనించిన ఆయన.. వైద్యుడిని అయి సొంతూరులో ఆస్పత్రి స్థాపించాలని కల కన్నారు. ఆ కల సాకారం చేసుకునేందుకు ఇష్టపడి, కష్టపడి వైద్య విద్య చదివి.. హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు. వృత్తిలో నైపుణ్యాన్ని, ఎన్నో గోల్డ్ మెడల్స్‌ను సైతం సంపాదించి.. ప్రముఖ వైద్యుడిగా పేరొంది.. గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చులో విలువైన ట్రీట్‌మెంట్ అందించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఇంతకీ ఆయనెవరంటే.. ఐఎంఏ(ఇండియన్ మెడికల్ అసోసియేషన్) హుజూరాబాద్ జమ్మికుంట శాఖ ప్రధాన కార్యదర్శి, మోత్కులగూడెం వాసి, సహస్ర స్టార్ హాస్పిటల్, సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, ఎంబీబీఎస్, ఎండీ జనరల్ ఫిజీషియన్, డీఏ కన్సల్టెంట్ ఫిజీషియన్, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, పెయిన్ స్పెషలిస్ట్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఊడుగుల సురేశ్..

 

 

చంద్రబాబు చేతుల మీదుగా అత్యున్నత ప్రతిభ అవార్డు..

మోత్కులగుడెంలో ఊడుగుల లక్ష్మీ-మల్లయ్య దంపతులకు 1985లో జన్మించిన సురేశ్ చిన్న నాటి నుంచి చదువులో ముందున్నారు. 1 నుంచి 7వ తరగతి వరకు జమ్మికుంట జవహర్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన సురేశ్..8 నుంచి 10 వ తరగతి వరకు విద్యోదయ హై‌స్కూల్ విద్యను అభ్యసించారు. ఆ సమయంలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్‌లో టాపర్‌గా నిలిచారు.

రాష్ట్ర స్థాయి‌లో 561 మార్కులు/600 సాధించారు. అందుకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అత్యున్నత ప్రతిభ అవార్డు అందుకున్నారు. బాల వికాస సమితి ఆధ్వర్యంలోనూ పురస్కారం అందుకున్నారు. హన్మకొండ ఎస్‌వీసీ కాలేజీలో ఇంటర్మీడియెట్‌లో బైపీసీ ఎంచుకున్న సురేశ్.. అక్కడ కూడా చదువులో రాణించారు. ఇంటర్‌లోనూ రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించారు. 956/1000 మార్కులు సాధించి.. శభాష్ అనిపించుకున్నారు.

మెడికల్ విద్యలో వరించిన స్వర్ణ పతకాలు

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనంతపూర్‌లో ఎంబీబీఎస్ విద్యను ఊడుగుల సురేశ్ అభ్యసించారు. చదువుతున్న క్రమంలో ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించి బెస్ట్ ఔట్ గోయింగ్ డాక్టర్‌గా ఎంసీఐ మెంబర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. అనంతరం డిప్లొమా ఇన్ అనేస్తేసియా చేశారు.

కేఎంసీ వరంగల్‌లో రాష్ట్ర వ్యాప్త క్విజ్ పోటీల్లో పాల్గొని మొదటి స్థానంలో నిలిచాడు. అనంతరం ఎండీ(జనరల్ మెడిసిన్) శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ తిరుపతిలో అభ్యసించారు. ఆ సమయంలోనూ అప్పటి కలెక్టర్ చేతుల మీదుగా బెస్ట్ డాక్టర్ అవార్డు అందుకున్నారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం కలిగిన సురేశ్ నిరాడంబరంగా ఉంటూ.. పేద ప్రజలకు వైద్యం అందిస్తూ.. సేవామార్గంలో ముందుకెళ్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జమ్మికుంట, హుజురాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. సదరు అసోసియేషన్ కార్యదర్శిగా వైద్యుల సమస్యల పరిష్కారం కోసం, వైద్యుల ఐక్యత కోసం పాటు పడుతున్నారు.

 

సామాజిక బాధ్యతపై పలు విషయాలపై అవేర్‌నెస్
పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న వైద్యులు తమ వృత్తి జీవితంలో ఎంతో బిజీగా ఉంటారు. తమ విధులు నిర్వర్తించే సమయంలోనూ దాదాపుగా తలమునకలై అలసిపోతుంటారు. కాగా, ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే.. సామాజిక బాధ్యతగా పలు విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ముందు వరుసలో నిలుస్తున్నారు డాక్టర్ ఊడుగుల సురేశ్.

నిత్యం సోషల్ మీడియా వేదికగా ప్రజారోగ్యం కోసం జ్వరం, షుగర్, బీపీ, గుండె పోటు, పాము కాటు, తేలు కాటు మొదలైన ఆరోగ్య సూత్రాలు, సైంటిఫిక్ విషయాలను గురించి అవగాహన కల్పిస్తుండటం విశేషం. ప్రజలకు నిత్యం ఆస్పత్రిలో అందుబాటులో ఉంటూనే.. ఫోన్ కాల్‌కు సైతం రెస్పాండ్ అయ్యేలా ఆయన సేవలు కొనసాగుతుండటం ముదావహమే. ‘ద జెర్డ్ గైడ్’తో పాటు షుగర్ ఇతర విషయాలపై డాక్టర్ ఊడుగుల సురేశ్ పుస్తకాలను సైతం రచించి అందుబాటులోకి తీసుకురావడం ప్రత్యేకం. ఆస్పత్రిలో రోగులకు అందరికీ అందుబాటులో వెంటిలేటర్, డయాలసిస్ సేవలు అందిస్తున్నారు.

బాల్యంలోనే నాయకత్వ లక్షణాలు

బాల్యం నుంచి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న డాక్టర్ ఊడుగుల సురేశ్.. చదువులో ముందుంటూనే.. విద్యార్థి దశలో జూనియర్ డాక్టర్స్ సంఘానికి అధ్యక్షుడిగా పని చేశాను. వైద్యుడిగా ప్రాక్టీసు మొదలుపెట్టిన తాను ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు అత్యంత విలువైన, ముఖ్యమైన ఐసీయూ, వెంటిలేటర్, డయాలసిస్, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ సర్వీసులను తక్కువ ఖర్చుతో అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు.

ఓ పేషెంట్(పేరు గోప్యం) పురుగుల మందు తాగిన క్రమంలో పేషెంట్‌కు వెంటిలేటర్ మీద చికిత్స చేయగా, సదరు పేషెంట్ రికవర్ అయి ధన్యవాదాలు తెలిపిన సందర్భంగా తనకు జీవితంలో డాక్టర్‌గా సంతృప్తిని ఇచ్చిందని సురేశ్ పేర్కొన్నారు. మోత్కులగూడెం గ్రామం, పరిసర ప్రాంత ప్రజలు సరైన వైద్యం కోసం హన్మకొండ, వరంగల్‌కు గతంలో వెళ్తుండేవారని, వారికి సరైన వైద్యం ఇక్కడే ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను తన సొంతూరు మోతుకులగూడెం జమ్మికుంటలోనే ఆస్పత్రి స్థాపించాలని చిన్ననాటే భావించానని పేర్కొన్నారు. అలా సహస్ర స్టార్ హాస్పిటల్‌ను సురేశ్ ప్రారంభించారు. డాక్టర్ ఊడుగుల సురేశ్ జీవిత భాగస్వామి డాక్టర్ ఊడుగుల అనిత(ఎంఎస్ జనరల్ సర్జన్)గా ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు.