- బాగా చదవాలనుంది: విద్యార్థిని వేడుకోలు
- చిన్ననాటే రెండు కాళ్లు వంకర.. చదువు పట్ల మక్కువ
- కుంటుతూనే 4 కి.మీ. నడిచి స్కూల్‌కు వెళ్తున్న సబ్జాన్
- ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా పాఠశాలకు..
వేద న్యూస్, కమలాపూర్:
విద్యతో పేదరికాన్ని జయించొచ్చనేది అక్షర సత్యం. ప్రస్తుత సమాజంలో ప్రతిఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల చదువు పట్ల ఎంతో జాగరుకతతో వ్యవహరిస్తున్నారు. చక్కటి పాఠశాలకు పంపించేందుకు ఎన్ని కష్టాలైనా పడుతున్నారు. ప్రతిరోజూ ఉదయం పూట స్కూల్ డ్రెస్, టిఫిన్ బాక్స్ సర్దడమే కాకుండా బస్సెక్కించి.. స్కూల్‌కు సాగనంపుతున్నారు. అయితే, ఆర్థికంగా ఆ మేరకు స్తోమత లేని వారి సంగతేంటి..? వారి కష్టాలు వర్ణనాతీతమే. అందులో సదరు విద్యార్థినికి అంగవైకల్య సమస్యలుంటే ఇక ఆ బాధలు చెప్పలేం. ఈ కోవకు చెందిన ఓ విద్యార్థియే.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని కాసింపల్లికి చెందిన ఓ నిరుపేద విద్యార్థిని సయ్యద్ సబ్జాన్ బి.
బాలిక తల్లిదండ్రులు అంగురా బి, హుస్సేన్. ప్రతి రోజూ స్కూల్‌కు వెళ్లేందుకు సబ్జాన్ పడే కష్టం చూస్తే కంటతడి పెట్టని వారుండబోరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిన్ననాటి నుంచి చదువు పట్ల ఆసక్తి కలిగిన సబ్జాన్ బి.. తన రెండు కాళ్లు వెనుకకు మెలి తిరిగి ఉన్నా.. ఇబ్బందులు పడుతూనే స్కూల్‌కు నడిచి వెళ్తోంది.
1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కమలాపూర్ మండల కేంద్రంలోని ఐవోసీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ప్రైమరీ స్కూల్‌లో చదివిన ఆమె.. ప్రస్తుతం ఆరో తరగతి చదవడం కోసం బాలికల జెడ్పీహెచ్‌ఎస్‌లో చేరింది. స్కూల్‌కు వెళ్లేందుకు.. కాసింపల్లిలోని తన ఇంటి నుంచి ఆమె ఉదయం దాదాపు 2 కి.మీ., తిరుగు ప్రయాణంలో 2 కి.మీ. మొత్తం సుమారు 4 కి.మీ. ప్రతిరోజూ అవస్థలు పడుతూ.. నరకయాతన అనుభవిస్తూ.. కుంటుతూ నడుస్తోంది. చదువు పట్ల పరితపనతో ముందుకెళ్తున్న సదరు విద్యార్థినికి హాస్టల్ సీటు ఇప్పిస్తే.. ఆమె కష్టాలు తీరుతాయని.. మానవతా దృక్పథంతో సీటు కేటాయించాలని విద్యార్థిని పేరెంట్స్ కోరుతున్నారు. తనకు హాస్టల్ సీటు ఇస్తే.. తాను బాగా చదువుకుంటానని విద్యా్ర్థిని సబ్జాన్ పేర్కొంటున్నారు.