= పొలంలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
= ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
వేద న్యూస్, ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెంకటపూర్-తిప్పాపూర్ గ్రామాల వద్ద శ్రీవాణి ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపి పొలంలోకి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. డ్రైవర్ తరచుగా వేగంగా బస్సు నడుపుతున్నాడని ఇప్పటికే పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాల భవనం కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడిందని, చుట్టూ సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదులు కూడా ఇరుకుగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. పాఠశాల బస్సులకు సరైన అనుమతులు ఉన్నాయా అనే విషయాన్ని అధికారులు పరిశీలించాలని, విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యం వహిస్తున్న పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.