•  చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ!

వేద న్యూస్, జగిత్యాల రూరల్:

జగిత్యాల రూరల్
మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన చోటుచేసుకుంది. ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన నాలుగు కుటుంబాలను కులం నుండి బహిష్కరించారు. అంతటితో ఆగకుండా ఆ కుటుంబాలతో ఎవరు మాట్లాడకూడదని ఊర్లో డప్పు చప్పుల్లతో దండోరా వేయించారు.

వెలివేసిన కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే రూ.25 వేల జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు బాధితులు తెలిపారు. ఆ కుటుంబాలతో కులానికి చెందిన ఎవరైనా మాట్లాడినట్లు సమాచారం అందించిన వారికి 5 వేల నజరానా కూడా ప్రకటించేశారు.

భక్తితో దేవుడికి కొబ్బరికాయ కొట్టేందుకు వస్తే 1,116 ఇచ్చిన తర్వాతనే కొట్టాలని తేల్చి చెప్పడంతో అది కాస్త కులబహిష్కరణకు దారి తీసినట్లు తెలుస్తున్న ది.

కంప్యూటర్ యుగంలో కూడా కులం పేరుతో కట్టుబాట్లు, బహిష్కరణల పేరుతో నిబంధనలు పెడితే బాధిత కుటుంబాలకు భవిష్యత్తు ఎక్కడికి దారితీస్తుందన్న ప్రశ్న జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటన పై కన్నీటి పర్యంతం అవుతున్న బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తు న్న ది. మరోవైపు కులం కట్టుబాట్ల పేరుతో ఇష్టానుసారం వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.