- సింగరేణి సీఎండీకి సీఐటీయూ ప్రతినిధి బృందం వినతి
వేద న్యూస్, మందమర్రి:
సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని సింగరేణి సిఎండి ఎన్ బలరాం నాయక్ (ఐఆర్ఎస్) ను సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు ప్రతినిధి బృందం కోరింది. గురువారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్లో సింగరేణి నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టన బలరాం నాయక్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదల, వారు ఎదుర్కొంటున్న సమస్యలు అదేవిధంగా గత సంవత్సరం సెప్టెంబర్ లో చేసిన ఒప్పందంలోని మిగల అంశాలు అమలు చేయించడంలో చొరవ తీసుకొని, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఈ మేరకు సీఎండి కి వినతి పత్రం అందజేశారు. స్పందించిన సిఎండి కాంట్రాక్ట్ కార్మికులకు 30లక్షల రూపాయల భీమా అమలు చేస్తామని, ఇఎస్ఐ అమలు కోసం కృషి చేస్తామని, అదేవిధంగా వేతనాల పెంపుదల, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, కాంట్రాక్ట్ కార్మికులకు మంచి భవిష్యత్తు కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. సిఐటియు ప్రతినిధి బృందంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు, రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్ తదితరులున్నారు.