వేద న్యూస్, జమ్మికుంట:
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జమ్మికుంట మండలకేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి ఉద్యమకారుల ఫోరం సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యమకారులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ కోసం కొట్లాడినటి ఉద్యమకారులను గుర్తించి వారిని ఆదుకోవాలని చెప్పి అనేక రకాల కార్యకలాపాల ద్వారా గత ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయామని గుర్తుచేసుకున్నారు.
అయినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి అందించలేదని చెప్పారు. ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను కలిసి పలు సందర్భాల్లో ఆయా పార్టీల మేనిఫెస్టోలో ఉద్యమకారుల గురించి పెట్లాలని ఉద్యమకారుల ఫోరం పక్షాన కోరినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి 250 చదరపు గజాల భూమి ఉద్యమకారులకు ఇస్తామని ప్రకటించింది. అది ఉద్యమకారులకు శుభ పరిణామం అని భావిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకీ కృతజ్ఞతలు తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల పరిధిలో ఉన్న ఉద్యమకారుల సమావేశం తాజాగా ఏర్పాటు చేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమకారుడు, ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన ఊకంటి మల్లాచారిని హుజురాబాద్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇన్ చార్జిగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 250 చదరపు గజాల ఇల్లు జాగా అనే కాకుండా నెలకు రూ.25 వేల చొప్పున పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కుమారస్వామి, తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్, సర్పంచ్ రాజిరెడ్డి, మహేందర్, ఆకుల రాజేందర్, బుడిగె శ్రీకాంత్, సంపత్, మహమ్మద్ అబ్జల్ తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.