వేద న్యూస్, వరంగల్ :
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని కొనసాగుతున్న ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీ (ఎఫ్ఎల్సీ) ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పరిశీలించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్వరలో జరిగే లోకసభ ఎన్నికల దృష్ట్యా ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ ఈనెల 5 నుండి 14వ తేదీ వరకు కొనసాగుతుందని ఆన్నారు.
ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈసీఐఎల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో జరుగుతున్నదని, ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోని వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజక వర్గాలకు సంబంధించిన ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియ లో 1906 బ్యాలెట్ యూనిట్లు, 1262 కంట్రోల్ యూనిట్లు, 1219 వివి ప్యాట్ల ను అధికారులు సాంకేతిక నిపుణులు తనిఖీ నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎఫ్ఎల్సి నిర్వహిస్తున్న 9 మంది ఈసిఐ ఎల్ ఇంజినీర్లు, అధికారులు, సాంకేతిక నిపుణులతో ఇప్పటివరకు చేపట్టిన ప్రక్రియను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసు చంద్ర, తహశీల్దార్లు ఇక్బాల్,నాగేశ్వర్ రావు, కలెక్టరేట్ ఎన్నికల పర్యవేక్షకులు విశ్వ నారాయణ, నాయబ్ తహశీల్దార్లు , ఎన్నికల విభాగం సిబ్బందితోపాటు ఈసీఐఎల్ ఇంజనీర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.