- సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్ అనితా రెడ్డి
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
మనకు ఉన్నదానిలో పదిమందిని సంతోష పెట్టగలిగితే అదే నిజమైన సంతృప్తి అని సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్, అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారెడ్డి అన్నారు. శనివారం ఆమె కాజీపేట లోని సహృదయ వృద్ధ ఆశ్రమాన్ని సందర్శించి వృద్ధుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అవసరమై చలిని నివారించే చలిక్యాప్స్, డైపర్స్ అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ వృద్ధాప్యము ఎవరికి శాపంగా మారకూడదని అన్నారు. బాధ్యతలను కూడా భారంగా భావించడం ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. వృద్ధులకు ప్రేమ, ఆప్యాయతలు పంచాలని, వారి వయస్సుకు గౌరవం ఇవ్వడం మన సంస్కారానికి నిదర్శనం అని వెల్లడించారు. రోజు రోజుకూ వృద్ధ ఆశ్రమాలు పెరిగే సంస్కృతి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఏ అవసరం ఉన్నా తనకు తెలియజేయవచ్చని, తాను చేయగలిగిన సాయం తప్పక చేస్తానని పేర్కొన్నారు.