వేద న్యూస్, హైదరాబాద్/చార్మినార్:
ఒక రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నప్పటికీ, సిటీ కళాశాల పూర్వ విద్యార్థినని చెప్పుకోవడంలోనే తనకు అమితానందం కలుగుతుందని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. సిటీ కళాశాల పూర్వ విద్యార్థులైన ఇంద్ర సేనారెడ్డి గవర్నర్ గా, మీర్ జుల్ఫీకర్ అలీ చార్మినార్ శాసన సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కళాశాలలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని  మాట్లాడారు.
సిటీ కళాశాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలోను పాలు పంచుకోవడం వల్ల తనకు నిజమైన సంతృప్తి కలుగుతుందని అన్నారు. కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులను ప్రణాళికాబద్ధంగా  భాగస్వాములను  చేయాల్సిన  అవసరం ఉందనీ సూచించారు. కళాశాల సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ బ్యాచ్ లకు సంబంధించిన  విద్యార్థులతో, శాఖల వారీగా సమావేశాలు నిర్వహించాలని అన్నారు.
తద్వారా నిధులు సేకరించి గ్రామీణ ప్రాంత పేద విద్యార్థుల సహాయార్థం ఒక కార్యాచరణ విధానాన్ని రూపొందించాలని చెప్పారు. సిటీ కళాశాల భవన పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.ఇందుకోసం  గవర్నర్ హోదాలో లేఖ కూడా రాస్తానని అన్నారు. కళాశాల పూర్వ విద్యార్థి, స్థానిక శాసనసభ్యులు కళాశాల సమస్యల పై అసెంబ్లీలో ప్రస్తావించాలని, ప్రభుత్వ సహాయాన్ని కూడా తీసుకోవాలని అన్నారు.
అనంతరం చార్మినార్ శాసన సభ్యులు జుల్ ఫికర్ ఆలీ మాట్లాడుతూ సిటీ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు దేశవిదేశాల్లో కూడా గౌరవం లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. సిటీ కళాశాలకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్న తాను ముందుంటానని అన్నారు.


కళాశాల పూర్వ విద్యార్థి, మాజీ పార్లమెంటు సభ్యులు మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ  కళాశాల ఎదుర్కొంటున్న సత్వర సమస్యలను పరిష్కరించడం కోసం నిరంతరం కృషి చేస్తానని, అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు కళాశాల ప్రతినిధులను తీసుకు వెళతానని అన్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.బాల భాస్కర్,  వైస్ ప్రిన్సిపాల్ డా ఐజాజ్ సుల్తానా, డా విప్లవ దత్ శుక్ల, డా.యాదయ్యలు, అధ్యాపక బృందం గవర్నర్  ఇంద్రసేనారెడ్డి గారిని, చార్మినార్ శాసన సభ్యులు జుల్ఫికర్ ఆలినీ, మాజీ పార్లమెంటు సభ్యులు మధు యాష్కీ గౌడ్ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి విద్యాధర భట్, సమన్వయ కర్త  డా.పావని, పూర్వ విద్యార్థులు ఐలయ్య, ఆచార్య వెంకట రాజం, డా.నాగేశ్వర రావు, రామేశ్వర్, సోమంచి, నోరి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.